కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా
Traffice Park : ట్రాఫిక్ పార్కు సందర్శించడం ద్వారా పిల్లలకు అవగాహనతో పాటు ప్రమాదాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. కరీంనగర్లోని తిమ్మాపూర్ లోని రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో గల పిల్లల ట్రాఫిక్ అవగాహన పార్కును జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు.

జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ పార్కులో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ పట్ల పిల్లలకు అవగాహన కలిగించే అన్ని రకాల బోర్డులు, గుర్తులు, సిగ్నల్స్ వంటివి ఏర్పాటు చేయాలని అన్నారు. నమూనా ఫిల్లింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడ అప్రమత్తత కోసం తీసుకోవాల్సిన చర్యలు వివరించే బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ ట్రాఫిక్ పార్కు సందర్శించేలా చూడాలని తెలిపారు. చిన్నప్పటి నుండే ట్రాఫిక్ అవగాహన వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. ట్రాఫిక్ పార్క్ లో ఏర్పాటు చేసిన ప్రతి గుర్తు గురించి పిల్లలకు వివరించాలని అన్నారు.
పార్కు డివైడర్లలో పూల మొక్కలు నాటించాలని సూచించారు. పార్కు సందర్శించేందుకు వచ్చిన పాఠశాల విద్యార్థులను పలకరించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు.
అనంతరం ఇక్కడ ఉన్న క్యాంటీన్ ని పరిశీలించారు. స్వశక్తి కేంద్రాల ద్వారా ఈ క్యాంటీన్ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా రవాణా శాఖ కమిషనర్ పురుషోత్తం, డీటీఓ శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, తహసీల్దార్ విజయ్, ఎంపీడీవో విజయ్ కుమార్ పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, కరీంనగర్