భూ సర్వేకు ఫోర్జరీ సంతకాలు
చనిపోయిన వ్యక్తి సంతకాలు సృష్టించిన రెవెన్యూ సహాయకులు
తనకేం తెలియదంటున్న తహసీల్దార్
‘శెనార్తి మీడియా’ కు తెలియడంతో సర్వే రద్దు
Forgery for Survey: మంచిర్యాల జిల్లాలో భూసర్వే అంటే రైతులకు న్యాయం జరగాలనే ఉద్దేశం లేదు. అధికారుల నిర్లక్ష్యం, సర్వేయర్ల స్వేచ్ఛారాహిత్యంతో భూ యజమానులకు తిప్పలు తప్పడం లేదు. తాజాగా జరిగిన ఘటన చూస్తే… చనిపోయిన వ్యక్తి పేరు మీద సంతకం పెట్టించి సర్వే పూర్తయిందని చెబుతున్న సర్వేయర్ వ్యవహారం సామాన్యులకు గుండెలు అదిరేలా చేస్తున్నది.
ఫోర్జరీ మాఫియా
ఓ రైతు తన భూమికి సర్వే చేయించేందుకు హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయం అధికారులను సంప్రదించాడు. హాజీపూర్ తహసీల్దార్ సర్వేయర్‌కు ఆ బాధ్యత అప్పగించాడు. నిబంధనల ప్రకారం, భూమి చుట్టుపక్కల ఉన్న భూస్వాములకు నోటీసులు పంపి వారి సంతకాలు తీసుకోవాలి. కానీ సదరు సర్వేయర్ చేసిన ఘనకార్యం తెలిసి భూ యజమానులు ఒక్కసారిగా షాకయ్యారు. స్వయంగా వెళ్లి నోటీసులు ఇవ్వకుండా, కార్యాలయంలోని కిందిస్థాయి సిబ్బందితో సంతకాలు ఫోర్జరీ చేయించాడు. ఇక్కడ మరీ దారుణమేమంటే చనిపోయిన వ్యక్తి సంతకం నోటీసుల్లో ఉండడంతో భూ యజమానులతో పాటు దరఖాస్తుదారు కూడా షాకయ్యాడు. దీనిని బట్టి రెవెన్యూ ఫోర్జరీలో ఎంతలా ఆరితేరి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సర్వే చేయడానికి రేపు వస్తానని వారికి చెప్పడం గమనార్హం.
తహసీల్దార్ నిద్రమత్తులో ఉన్నాడా?
ఇంత అవకతవకలు జరుగుతున్నా తహసీల్దార్ తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. మేజిస్ర్టేట్ స్థాయి అధికారి నిర్లక్ష్యంగా సంతకాలు పెట్టడం, ఫైల్స్ ఫార్వార్డ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వేకు సంబంధించి వచ్చిన ఫైళ్లలో ఏది వాస్తవం, ఏది ఫోర్జరీ అనేది చూడకుండా అనుమతులు ఇవ్వడం పరిపాటిగా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
శెనార్తి మీడియా గుట్ట లాగడంతో.. సర్వే రద్దు
ఫోర్జరీ సంతకాల వ్యవహారంపై శెనార్తి మీడియా ప్రతినిధి సదరు సర్వేయర్‌ను ఫోన్‌లో వివరణ కోరగా, తమ సిబ్బందిని సంతకాల కోసం పంపించాను అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఎక్కడ ఈ విషయం బయటపడుతుందోనని శుక్రవారం చేపట్టాల్సిన భూసర్వేను రద్దు చేసేశాడు.
ప్రజల ప్రశ్నలకేవి జవాబులు
- “భూమి మాది…
- హక్కులు మావి..
- సర్వే పేరు మీద ఈ మోసాలు ఎందుకు?”
- ఈ ఘటన ఒక్కచోటే జరిగిందా? లేక జిల్లావ్యాప్తంగా ఇదే విధానమా?
- ప్రభుత్వ వ్యవస్థే నమ్మకద్రోహం చేస్తే..
న్యాయం కోసం ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి..?
మరి ఇలాంటి వారిపై జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాల్సిందే.
ఇది ఇలా ఉంటే చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులను శెనార్తి మీడియా సంప్రదించింది. తమ తండ్రి చనిపోయి నాలుగేళ్లు అవుతున్నదని తెలిపారు. కానీ ఇప్పుడు తమ పక్కనున్న భూమిని కొలవడానికి తనను సర్వేయర్ కానీ, సిబ్బంది కానీ సంప్రదించలేదని వివరించారు. కేవలం వాట్సాప్ లో నోటీసు పంపారని, అందులో తమ తండ్రి సంతకం ఉండేసరికి అవాక్కైనట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తుల సంతకాలు పెట్టడం ఏమిటి? ఇలాంటివి ఎన్ని చేస్తున్నారో అసలు జిల్లా పెద్ద సారు ఈ వ్యవహారం చూస్తే బాగుంటుంది.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
