తెలుగు పరీక్షకు బదులు హిందీ పేపర్
రెండు గంటలు ఆలస్యంగా పరీక్ష నిర్వహణ
మంచిర్యాలలో తల్లిదండ్రుల ఆందోళన
SSC Exams: మంచిర్యాల జిల్లా కేంద్రంలో పదో తరగతి(SSC Exams) వార్షిక పరీక్షల తొలిరోజు అవాంతరం చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 49 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం మొత్తం 9189 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో రెగ్యులర్ విద్యార్థులు బాలురు 4725, బాలికలు 4464 మంది ఉన్నారు.

అయితే, మంచిర్యాల ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల(ZPHS)లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో అవాంతరం చోటు చేసుకుంది. తెలుగు పేపర్(Telugu Paper)కు బదులుగా హిందీ పేపర్ కేంద్రానికి చేరుకుంది. ఈ విషయం గుర్తించి అప్రమత్తమైన సీఎస్ జిల్లా విద్యాశాఖాధికారికి తెలియజేశారు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సెంటర్ లో జరగడంతో ఒకింత గందరగోళం నెలకొంది.

వెంటనే అప్రమత్తమైన డీఈవో.. జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకొని సరిచేసిన పరీక్ష పేపర్‌ను విద్యార్థులకు ఇచ్చారు. ఉదయం 9.30గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11:30 గంటలకు మొదలైంది. దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్షలు రాయాల్సి వచ్చింది.
పరీక్షను మరో రెండు గంటలు పొడిగించినట్లు సమాచారం. పూర్తి వివరాలు విద్యార్థులు బయటకు వచ్చిన తరువాత తెలియనుండగా పరీక్ష నిర్వహణలో ఏర్పడిన ఈ పొరపాటుపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.