పార్టీ వీడిన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి తాడూరి
కీలక పాత్ర పోషించిన గూడూరు సురేష్
Jonings in BRS : మానకొండూర్ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికార పార్టీని చెందిన కీలక నేత, యూత్ కాంగ్రెస్ నాయకుడు(Youth Congress Leader) గులాబీ గూటికి చేరడం సంచలనంగా మారింది. తాజా రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ అని స్థానికంగా చర్చ జరుగుతున్నది. మానకొండూరులోని గన్నేరువరం మండలం(Ganneruvaram Mandal) జంగపల్లి గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ మానకొండూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తాడూరి వంశీకృష్ణా రెడ్డి(Taduri Vamsi Krishnareddy) ఆ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే రమసయి మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలతో ఇద్దరి మధ్య వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒక్కసారిగా అధికార పార్టీ నుంచి యూత్ లీడర్ కాంగ్రెస్ పార్టీని వీడడంతో హస్తం పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లేనని పలువురు పేర్కొంటున్నారు.
బీఆర్ఎస్ లోకి వంశీకృష్ణారెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తాడూరి వంశీకృష్ణా రెడ్డి ఆదివారం గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరు సురేష్(Guduru Suresh) ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలో కారు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మాడుగుల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదనే..
బీఆర్ఎస్‌లోకి వంశీ కృష్ణ వెళ్లడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ(Kavvampalli Satyanarayana)కు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ బలోపేతం చేయడం అటు ఉంచితే ఏకంగా పార్టీని నాయకులు వీడడంపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. మాజీ ఎమ్మెల్యే రసమయి విమర్శలకు సరైన రీతిలో సమాధానం ఇవ్వకపోవడంతో ప్రజల్లో అధికార పార్టీపై అసహనం వ్యక్తమవుతున్నది. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీనియర్ మంత్రులు ఎమ్మెల్యే కవ్వంపల్లికి సూచించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీని వీడిన వంశీకృష్ణా రెడ్డి ‘శెనార్తి మీడియా’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కష్టపడుతున్న వారికి ప్రాధాన్యం దక్కడం లేదని తెలిపారు.
ఈ మొత్తం ఎపిసోడ్‌లో బీఆర్ఎస్ యువ నాయకుడు గూడూరు సురేష్ కీలకంగా మారారు. వంశీకృష్ణ పార్టీలోకి రావడం వెనక ముఖ్యపాత్ర పోషించింది ఆయనే అన్నట్టుగా ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్‌కు ఇది ఇబ్బందికర పరిణామమేనని పలువురు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ లో చేరికలు వంశీకృష్ణతోనే ఆగిపోతాయా..లేక మరికొంతమంది గులాబీ గూటికి చేరుతారా అనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతున్నది.
మరికొందరు అదే బాటలో..
యువజన నాయకులు, పార్టీ సీనియర్లు కూడా పార్టీని వీడాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తున్నది. మానకొండూర్‌లో అధికార కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ(CONGRESS PARTY)పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, పార్టీ పరంగా ఎలాంటి హామీలు లేకపోవడంతో లీడర్లు ప్రత్యామ్నాయం వెతుక్కుంటున్నట్లు తెలుస్తున్నది.
– శెనార్తి మీడియా, మానకొండూర్