- ఐదు రకాల సేవలపై సిటిజన్ ఫీడ్‌బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్‌లు
PUBLIC OPINION ON POLICE : రాష్ట్రంలో పోలీసుల సేవలపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న ఐదు ముఖ్య సేవలపై ప్రజలు తమ అభిప్రాయం తెలుపవచ్చు. ఇందుకోసం క్యూఆర్ కోడ్ ఆధారిత ‘సిటిజన్ ఫీడ్‌బ్యాక్’ (CITIZEN PORTAL) విధానాన్ని పోలీస్ శాఖ ప్రవేశపెట్టింది.
ఈ ప్రక్రియలో ముందుగా ప్రజలు క్యూఆర్ (QR CODE) కోడ్‌ను స్కాన్ చేసి ఫిర్యాదు స్వీకరణ, ఎస్ఐఆర్, ఈ-చలాన్ (E-Challan), పాస్‌పోర్ట్ (PASSPORT) ధ్రువీకరణ.. ఇతర సేవలపై తమ అభిప్రాయం తెలుపవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు తమకు ఎదురైన అనుభవాలను, పోలీసుల స్పందనను, సేవల నాణ్యతను ఈ యాప్ ద్వారా తెలియజేయవచ్చు. ప్రస్తుతం పలుచోట్ల ప్రజలు స్కాన్ చేసి అభిప్రాయాలను తెలియజేస్తుండగా, అందులో అధిక శాతం పోలీసుల సేవలపై సానుకూల స్పందనే వచ్చినట్లు సమాచారం.
- ఉత్తమ ప్రదర్శనకు అవార్డులు…
సిటిజన్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమంగా పనిచేసిన పోలీస్ స్టేషన్లకు ఇటీవల అవార్డులు ప్రకటించారు. 709 స్టేషన్లలో ప్రామాణిక సేవలు అందించిన 10 మంది ఎస్ఐలకు డీజీపీ జితేందర్ అవార్డులు అందించారు. పోలీసుల పనితీరుపై ప్రజల ప్రశంసలతో పాటు అవసరమైన సూచనలు కూడా వస్తుండటంతో ఈ కార్యక్రమం ప్రజా సంబంధాల బలోపేతానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
- ఫిర్యాదులు నేరుగా డీజీపీ కార్యాలయానికే : ఆర్. ప్రకాష్, మంచిర్యాల ఏసీపీ

క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత పొందిన వివరాలు నేరుగా డీజీపీ కార్యాలయానికి చేరుతాయి. వాటిని కేవలం ఉన్నతాధికారులే పరిశీలిస్తారు. కాబట్టి ఎవరు భయపడకుండా స్వేచ్ఛగా అభిప్రాయం తెలపవచ్చు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
