- మంచిర్యాలలో అదుపు తప్పిన శాంతిభద్రతలు..
- కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాడులు మొదలయ్యాయి..
- పోలీస్ స్టేషన్ లోకి ఎంత మంది చొరబడ్డారో సీసీ ఫుటేజీలు బయట పెట్టాలి
- మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
Divakar Rao Press Meet : జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా దారి తప్పాయని మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన పలు అంశాలను ప్రస్తావించారు.
“మా ప్రభుత్వ హయాంలో మంచిర్యాలలో దాడులు లేవు. ఇప్పుడు మాత్రం దాడులే జరుగుతున్నాయి. పోలీసులు ముందుగానే సమాచారం ఉన్నా పట్టించుకోలేదు. కాంగ్రెస్ నాయకులు ఎంతమంది పోలీస్‌స్టేషన్‌లోకి చొరబడ్డారో సీసీ కెమెరా వీడియో బయట పెట్టాలి. దాడులకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

అలాగే, 21 నెలలుగా కాంగ్రెస్ నాయకులపై ఒక్క కేసు కూడా పెట్టలేదని ప్రశ్నించారు. రాపల్లిలో బీఆర్‌ఎస్ ఫ్లెక్సీపై కాంగ్రెస్ బ్యానర్లు కడుతున్నారని విమర్శించారు. “రామగుండం సీపీ సీఐ తిరుపై విచారణ జరిపి స్టేషన్‌లోకి ఎంతమంది చొరబడ్డారో తెలుసుకోవాలి. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ పోలీసులు తమ విధి నిర్వర్తించాలి” అని దివాకర్‌రావు వ్యాఖ్యానించారు.
“హైదరాబాద్‌లోని డీజీ ఒకసారి మంచిర్యాలలో ఏం జరుగుతుందో పరిశీలించాలి. ముఖ్యమంత్రి సైతం సీనియర్ జడ్జితో విచారణ చేయించి నిజాలు వెలుగులోకి తేవాలి. తప్పుడు కేసులు, దాడులు ఆపాలి” అని విజ్ఞప్తి చేశారు.
గంజాయి కేసుల విషయంలో తాను, తన కుమారుడు ఎక్కడైనా ప్రమాణం చేస్తామని ఆయన సవాలు విసిరారు. “మా పాలనలో ఇలాంటి దాడులు జరగలేదు. అధికారులే ఇప్పుడు కొడుతూ వీడియో తీయమంటున్నారు. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి” అని దివాకర్‌రావు స్పష్టం చేశారు.
పోలీస్‌స్టేషన్‌లోనే దాడి – సీపీతో విచారణ జరపాలని డిమాండ్
జిల్లాలో రౌడీజం పెరిగిపోయిందని, బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు అధికమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అర్థరాత్రి కాటమరాజుపై జరిగిన దాడి బాధాకరమని వారు పేర్కొన్నారు.
“పోలీస్‌స్టేషన్‌లోనే దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండటం చాలా దురదృష్టకరం. గాయపడిన నాయకుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికీ సహకరించలేదు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు వత్తాసు పలుకుతున్నారు” అని విమర్శించారు.
సీఐ అశోక్ ప్రవర్తనను కూడా వారు తప్పుపట్టారు. “బీఆర్‌ఎస్ నాయకులపై బూతులు తిట్టుతూ, హంగామా సృష్టిస్తూ, వారినే కొడుతూ కేసులు పెడుతున్నారు. ఇది అసహ్యం” అని ఆరోపించారు.
ఈ ఘటనపై సీపీతో పాటు ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించాలని వారు డిమాండ్ చేశారు. “మంచిర్యాల దాడులపై సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలి. గంజాయి కేసు పేరుతో దాడులు చేయిస్తున్నారు. రాజకీయ లాభం కోసం తప్పుడు ఆరోపణలు మోపుతున్నారు” అని మండిపడ్డారు.
“పోలీసుల నిర్లక్ష్యమే ఇలాంటి దాడులకు కారణం. కొడుతూ వీడియోలు తీస్తూ సంతోషపడుతున్నారు. ఇలా కొనసాగితే ప్రజలు ప్రతిఘటిస్తారు. నిన్నటి ఘటనపై సీపీ ఎంక్వైరీ జరిపి తప్పిదాలపై చర్యలు తీసుకోవాలి” అని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

– శెనార్తి మీడియా, మంచిర్యాల:
