Community contact: శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో శుక్రవారం ఉదయం కేశవపట్నం పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువీకరణ పత్రాలు లేని 52 వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఏసీపీ మాధవి మాట్లాడారు. సంఘ విద్రోహక శక్తులకు అడ్డుకట్ట వేసేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఎవరైనా అపరిచితులు కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టి ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎవరైనా పోలీసులమంటూ వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్టు చేశామని చెబితే నమ్మొద్దన్నారు. డిజిటల్ అరెస్టులు ఉండవని స్పష్టం చేశారు. అపరిచితులు కాల్ చేసి బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్, ఇతర వివరాలు అడిగితే చెప్పొద్దని సూచించారు.

గంజాయి బారిన పడొద్దు
యువత గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి విక్రయించినా, తరలించినా, సేవించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ సీఐ పులి వెంకట్ , కేశవపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డి, పోలీసులు పాల్గొన్నారు.
