- విద్యార్థుల కోసం… ముందు నుంచే గాలాలు
- ఉపాధ్యాయులకు అవార్డుల పేరిట స్పాన్సర్స్ లు
- ప్రైవేటు పాఠశాలల సంఘాలకు నజరానాలు..?
- ఏడాదిలో ఒక టూర్ ప్యాకేజీలు..!
Corporate Bargaining :విద్యార్థులకు గాలం వేసేందుకు ముందు నుంచే కొన్ని ప్రైవేటు జూనియర్ కళాశాలలు కదంతొక్కుతున్నాయి. ఒక కళాశాల కొన్ని పాఠశాలలకు స్పాన్సర్ చేస్తుంటే మరో కళాశాల మరి కొన్నింటికి స్పాన్సర్ చేస్తున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల టార్గేటే లక్ష్యంగా పోటీపడి నజరానాలు ముట్టజెప్పుతున్నాయి. అవి సైతం అధికారికంగా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తున్నట్లు చేస్తూనే కరస్పాండెంట్లు, హెడ్మాస్టర్లకు ప్యాకేజీలు ఇస్తున్నారు. అంతే కాకుండా ఉపాధ్యాయ సంఘాలు రాజకీయ సంఘాలకు అనుబంధంగా పని చేస్తూ అందులో పని చేసే ఉపాధ్యాయులను వారికి అనుకూలంగా ఎన్నికలలో తింపి ఉన్నత (గురు) స్థానంలో ఉన్న వారిని గల్లీల్లో ఇంటింటికి తిప్పించారు. ప్రస్తుతం ఇలా కార్పొరేటు సంస్థలకు తొత్తులుగా మారి వెయ్యి రూపాయల మెమొంటో, శాలువలు కప్పి విద్యార్థులకు చదువుకు బదులు స్పాన్సర్ చేసిన సంస్థలో చేరాలని విద్యార్థులను మోటీవేట్ చేయాలని గాలాలు వేస్తున్నారు.

ఉపాధ్యాయులకు అవార్డుల పేరిట స్పాన్సర్స్ లు…
జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు రెండు సంఘాలుగా విడిపోయి ఆదిపత్యం కోసం పోటీపడుతున్నాయి. విద్యార్థులకు చదువు చెప్పడంలో, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడంలో పడని పోటీ పెద్ద పెద్ద కళాశాలల నుంచి నజరానాలు తీసుకునేందుకు పోటీపడుతుంటారు. ఒక సంఘానికి ఒక కళాశాల స్పాన్సర్ చేస్తుంటే, మరో సంఘానికి మరో కళాశాల యాజమాన్యం స్పాన్సర్ చేస్తుంది. ఇటీవల ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వేర్వేరుగా నిర్వహించాయి. ఈ నెల 3వ తేదీన ఒక గార్డెన్ లో ట్రస్మా పేరిట ఒక సంఘం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తే ఈ సంఘానికి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు స్పాన్సర్ షిప్ ఇవ్వగా, ఈ నెల 18 మరో ట్రస్మా సంఘం ఉపాధ్యాయులకు గురు బ్రహ్మ అవార్డుల పేరిట నిర్వహించిన కార్యక్రమానికి కోట ఇనిస్టిట్యూట్ స్పాన్సర్ చేసినట్లు సమాచారం. ఈ రెండు సంఘాలకు స్పాన్సర్ చేసిన కళాశాలలు కరీంనగర్ కు చెందిన విద్యా సంస్థలే కావడం, ఈ కార్యక్రమాల ఖర్చు వారే భరించినట్లు తెలిసింది.

ఏడాదిలో ఒక టూర్ ప్యాకేజీలు..!
ప్రైవేటు విద్యా సంస్థల సంఘాలు ఏడాదికి ఒక ప్రాంతానికి వెళుతుంటాయి. వాటికి ఖర్చులు మొత్తం కొన్నికళాశాలల యాజమాన్యాలే భరిస్తున్నాయి. ఇందుకు ప్రతిఫలంగా ఆ సంఘంలోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల అడ్రస్ లు, వారి కాంటాక్టు ఫోన్ నెంబర్ లు యాజమాన్యాలు అందజేస్తుంటాయి. ప్రైవేటు పాఠశాలలు వారి స్వార్థం కోసం, జల్సాల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు ఇవ్వడంతో ఇక కళాశాలల యాజమాన్యాలు పది నిమిషాలకోసారి ఫోన్ లు, వారంలో రెండు సార్లు ఇంటి బాట పెట్టి అడ్మీషన్ పొందేంత వరకు చంపుకుతింటారు. ఇదంతా ఈ ప్రైవేటు పాఠశాలల అమ్ముడుపోయేతనమే కారణం. ఇలా కళాశాలలు ఇచ్చే ప్యాకేజీలతో దసరా, సంక్రాంతి తదితర పండులకు వచ్చే సెలవుల్లో టూర్ల మీద టూర్లు వేస్తుంటారు.
ప్రైవేటు పాఠశాలల సంఘాలకు నజరానాలు..?
నజరానాల కోసం ప్రైవేటు పాఠశాలలు పోటీపడి సంఘాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మొదట ఒకే ట్రస్మా సంఘం కింద పని చేసిన యాజమాన్యాలు తర్వాత రెండుగా వీడిపోయాయి. ట్రస్మా రాష్ట్ర స్థాయిలో రెండు నుంచి మూడు సంఘాలుగా ఏర్పడ్డాయి. కందాల బాపురెడ్డి ట్రస్మాఫౌండర్ వర్గం ఒకటి కాగా మరోటి శేఖర్ రావు యాదగిరి వర్గం ట్రస్మా (శివరాత్రి యాదగిరి అధ్యక్షుడు), ఇందులో నుంచే మధుసూదన్ రెడ్డి వర్గం ట్రస్మా ఏర్పడింది. ఇవి చాలక అదనంగా జిల్లాలో 2024లో మంచిర్యాల ట్రస్మాగా మరో సంఘం రిజిస్ట్రేషన్ చేసుకుంది. ఇవన్నీ పదవుల కోసం, కార్పొరేటు కళాశాలల ప్యాకేజీలు, నజరానాల కోసం పోటీపడి ఏర్పడిన సంఘాలుగానే కనిపిస్తున్నాయి తప్ప ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు చేసిందేమి లేదు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల ప్రతినిధి
