- ఏజీఎల్ టూ కమర్షియల్ సరఫరా…
- పాత్ర దారి.., సూత్రదారి ఎవరు..?
DISTRIBUTION TRANSFORMERS : జిల్లాలోని పలువురు విద్యుత్ శాఖ అధికారుల పనితీరు అనుమానాలకు తావిస్తుంది. రైతులు, లబ్ధిదారులు నాణ్యమైన విద్యుత్ లభించక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కోటపల్లి మండల పరిధిలోని విద్యుత్ అధికారుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది.
నిజామాబాద్ – జగ్దల్ పూర్ జాతీయ రహదారికి ఆనుకొని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నుంచి మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత నది తీరం వరకు పదిదాక దాబాలు నడుస్తున్నాయి. సాధారణంగా గ్రామాల మధ్య ఉండే గృహాలకు, కమర్షియల్ దుకాణాలకు, దాబాలకు విద్యుత్ సరఫరా చేయడం సులభమే కానీ గ్రామాలకు దూరంగా ఉండే ఈ దాబాలకు విద్యుత్ ఎక్కడి నుంచి వస్తోంది అనేది స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఏజీఎల్ టూ కమర్షియల్ సరఫరా…
వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల నుంచి బోరు బావులకు సరఫరా చేయాల్సిన విద్యుత్‌ను కొంత మంది అధికారులు దారి మళ్లించి, ఉన్నతాధికారుల కండ్లు కప్పి కమర్షియల్ మీటర్ల(దాబాల)కు చేరుస్తున్నారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. సుమారు 150 మీటర్ల దూరం నుంచి జాతీయ రహదారి అవతల వ్యవసాయ మీటర్లకు ఉపయోగించే విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ నుంచి నేరుగా వైర్లు లాగి, నీరు ప్రవహించే బ్రిడ్జి కింద దాబాలకు కనెక్షన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుకోకుండా వైర్ తెగితే ప్రమాదం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పశువులు ఈ దారి వెంట మోస్తూ వెళితే అడ్డుగా ఉన్న లైబుల్ తో షాక్ గురయ్యే ప్రమాదం లేకపోలేదు. అలా ఏదైనా ప్రమాదం సంభవిస్తే బాధ్యులెవరు..? మరోవైపు ఏజీఎల్ ట్రాన్స్ ఫార్మర్ నుంచి కమర్షియల్ విద్యుత్ మీటర్లకు కరంటు సరఫరా చేస్తుండటం పలు అనుమాలకు తావిస్తుంది. ఇది వారికి ‘మామూలు’ తతంగం కావచ్చు కానీ ప్రాణాలతో చెలగాటం సరైంది కాదని రైతులు, పశుపోషకులు అభిప్రాయపడుతున్నారు.

- పాత్ర దారి.., సూత్రదారి ఎవరు..?
ఈ తతంగం వెనుక ఎవరు పాత్రదారి.. ఎవరు సూత్రదారో సంబంధిత అధికారుల విచారణ జరిపితే వెలుగులోకి రానుంది. ఎందుకు ‘కమర్షియల్ కనెక్షన్’ను వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ కి కనెక్షన్ కల్పించారో అనేదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పైగా, సంబంధిత అధికారులపై వచ్చిన ఫిర్యాదులను తేలికగా తీసుకోవడమే కాకుండా, ఒకసారి బదిలీ అయిన వారు తిరిగి అదే ప్రాంతానికి రావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. “రైతులకు సరైన సమయంలో విద్యుత్ అందక కష్టాలు పడుతుంటే, దాబాలకు మాత్రం ‘స్పెషల్ ట్రీట్మెంట్’ ఎలా వస్తోంది?” అని ప్రశ్నలు తలెత్తతున్నాయి. కింది స్థాయి సిబ్బందిని కాపాడేందుకు ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ అవకతవకలపై జిల్లా స్థాయి విజిలెన్స్ బృందం దృష్టి సారించి నిజానిజాలు వెలికితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై కోటపల్లి ఏఈ వెంకటేశ్వర్లును వివరణ కోరగా సదరు దాబా యజమాని ట్రాన్స్ ఫార్మర్ కి డీడీ తీశారు, కాంట్రాక్టర్లు స్ట్రైక్ లో ఉన్నారు, దీనితో మీటరు పెట్టి ఏజీఎల్ ట్రాన్స్ ఫార్మర్ నుంచి వారం, పది రోజుల నుంచి కరంటు సరఫరా చేస్తున్నాం. అది కూడా పై అధికారుల ఆదేశాల మేరకు సుమారు 300 మీటర్ల దూరంలో ఉన్న ఏజీఎల్ ట్రాన్స్ ఫార్మర్ నుంచి విద్యుత్ ఇచ్చాం. ఏడీఈకి, డీఈలకు తెలుసు, దీనిపై రాజకీయ ఒత్తిడి ఉండటంతో కనక్షన్ కు డబ్బులు కట్టడంతోనే ఇచ్చాం అని పేర్కొన్నారు.
- డబ్బులు కట్టిన తర్వాతనే కనక్షన్ ఇచ్చాం – బాలకృష్ణ, ఏడీఈ చెన్నూర్
ఎస్టిమేషన్ ప్రకారం ట్రాన్స్ ఫార్మర్ కి డబ్బులు కట్టిన తర్వాతనే దాబాకు కొత్త ట్రాన్స్ ఫార్మర్ పెట్టి మీటరు ఇచ్చాం. ఏజీఎల్ ట్రాన్స్ ఫార్మర్ నుంచి ఇచ్చిన విద్యుత్ ఇస్తున్న విషయం తెలియదు. దూరం నుంచి కరంటు ఇవ్వం. 11 కేవీ నుంచి మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు నా నోటీసులో ఉంది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
