- పోలీసుల ఎదుట లొంగపోయిన మావోయిస్టు కీలక నేత
- ఆయుధాలు వీడిన మల్లోజుల వేణుగోపాల్
Mallojula :మావోయిస్టు ఉద్యమ చరిత్రలో కీలక మలుపు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా అడవులను ఆధారంగా చేసుకొని సాయుధ పోరాటం నడిపిన అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను, అలియాస్ భూపతి చివరకు ఆయుధాలు వదిలిపెట్టి ప్రభుత్వానికి లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లాలో మరో 60మంది మావోయిస్టు కార్యకర్తలతో కలిసి ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయిన ఘటన మావోయిస్టు శిబిరాల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది.
1970ల్లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో చేరిన వేణుగోపాల్, ఆ తర్వాత పార్టీ పొలిట్ బ్యూరో స్థాయికి ఎదిగి కీలక వ్యూహకర్తగా పేరుపొందారు. ఆయన సోదరుడు మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ మృతి తర్వాత భూపతి ఉద్యమానికి కొత్త దిశ చూపే ప్రయత్నం చేశారు. పార్టీ అంతర్గత విధానాలు, వ్యూహాల రూపకల్పనలో ఆయనకు ప్రత్యేక పాత్ర ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి ఆపరేషన్ “కగార్” ప్రభావంతో భూపతి వంటి నాయకులు కూడా మార్పు అవసరాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్‌శర్మ ప్రకారం, మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవడం సానుకూల పరిణామం. కానీ ఇంకా అడవుల్లో తుపాకీ పట్టుకున్నవారికి సాయుధ దళాలు సమాధానం చెబుతాయని ఆయన హెచ్చరించారు. భూపతి తలపై ఉన్న ఆరు కోట్లకు పైగా నజరానా ఆయన స్థాయిని సూచిస్తుంది. ఇటీవల కాల్పుల విరమణ, శాంతి చర్చల పేరిట అభయ్ అనే పేరుతో విడుదల చేసిన ప్రకటనలు ప్రకంపనలు రేపాయి. మావోయిస్టులు సైతం ఆత్మపరిశీలన చేసుకోవడానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని 2026 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. ఈ లొంగుబాటు ఆ లక్ష్యానికి బలమైన అడుగుగా పరిగణించవచ్చు. దీంతో మావోయిస్టు ఉద్యమం లోపలే చీలికలు తీవ్రతరం కావడం ఖాయం. అరణ్యాల్లో తుపాకులు మౌనం పాటిస్తాయా? లేక కొత్త వ్యూహంతో మావోయిస్టులు మళ్లీ ముందుకు సాగుతారా? అనేది రానున్న కాలం నిర్ణయించనుంది.
