- సంస్థాగత ఎన్నికల సమావేశంలో రభస..
- చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘర్షణ..
- ఎమ్మెల్యే ముందు దాడి చేసుకున్న ఇరు వర్గాలు..
- బయటపడ్డ అంతర్గత విభేదాలు..
INFIGHTING AGAIN IN CONGRESS : కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి పొడచూపాయి. టీపీసీసీ రాష్ట్ర స్థాయి పరిశీలకుల ముందే రెండు వర్గాలు బాహాబాహికి దిగాయి. చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందుకు వేదికైంది. వివరాలిలా ఉన్నాయి. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులుగా ఆయిల్ పెర్టిలైజర్స్ చైర్మన్ రాఘవ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ రాంభూపాల్ హాజరయ్యారు. చెన్నూర్ నియోజకవర్గంలో మండల స్థాయి నుంచి గ్రామస్థాయి నాయకుల పార్టీ పదవుల ఎంపికకు ఈ సమావేశం నిర్వహించారు. పార్టీ పదవుల కోసం పలువురి పేర్లను ప్రస్తావిస్తుండగా నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉంటూ వివేక్ ఎమ్మెల్యేగా గెలిచేందుకు దోహదపడిన పాత నాయకులను కాదని, కొత్తగా చేరిన వారి పేర్లను ఎలా ప్రస్తావిస్తారంటూ ఓ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో అంతా తానేనంటూ వ్యవహరిస్తున్న చెన్నూర్ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, షాడో ఎమ్మెల్యేకు చెందిన మరో వర్గం ఒక్కసారిగా ఘర్షణకు దిగింది. దీంతో ఇరు వర్గాల మద్య తోపులాట చోటుచేసుకుంది. చెన్నూర్ మాజీ కౌన్సిలర్ పోగుల సతీష్‌పై మందమర్రికి చెందిన నాయకుడు దాడి చేశాడు. ఎక్కడి నుంచో వచ్చి చెన్నూర్ పట్టణంతో రాజకీయం చేస్తున్నారని, స్థానిక సీనియర్ కాంగ్రెస్ పలువురు నాయకులు మండిపడ్డారు. కార్యకర్తలు వస్తే పనులు చేయొద్దని, ఎమ్మెలే చెబితేనే పనులు చేయాలని వివేక్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు గౌరవం దక్కడం లేదని ఓ వర్గం నాయకులు ఎన్నిక పరిశీలకుల దృష్టికి తీసుకెళ్లారు. ఇరు వర్గాల వాదోపవాదాలతో సమావేశం కాస్త గందరగోళంగా మారింది. నాయకులు,కార్యకర్తలు సంయమనం పాటించాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి కచ్చితంగా న్యాయం జరుగుతుందంటూ అనంతరం ఎన్నికల పరిశీలకులు పార్టీ శ్రేణులను సముదాయించే ప్రయత్నం చేసి, కార్యక్రమాన్ని ముగించారు. ఎమ్మెల్యే ముందే సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే పని తీరు సక్రమంగా లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ గ్రూపు రాజకీయాలతో అంతర్గత విభేదాలు బయటపడినట్లయ్యింది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :