- ఐక్య సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన
Journalists JAC : వరంగల్ జిల్లాలోని నమస్తే తెలంగాణ దిన పత్రిక ఎడిషన్ కార్యాలయంపై కొంతమంది దుండగులు బుధవారం దాడి చేయడాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట జర్నలిస్టుల ఐక్య సంఘాల ఆధ్వర్యంలో గురువారంనల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పత్రికలపై మీడియాపై జరిగిన దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణించాలి అని అన్నారు. అన్యాయాలను నిష్పక్షపాతంగా సమాజానికి అందించే నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై కక్షసాధింపు చర్యలు దారుణమని విమర్శించారు. ప్రశ్నించే గొంతులను అణిచివేతకు గురిచేయడం సరికాదన్నారు.
దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృత్తం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మీడియాపై దాడులకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టి జర్నలిస్టుల సత్తా చాటుతామని హెచ్చరించారు. ప్రభుత్వం, పోలీసు అధికారులు పత్రికా కార్యాలయంపై దాడికి కారకులను చట్టపరంగా శిక్షించాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో ఐక్య జర్నలిస్ట్ లు చిట్ల రమేష్, ఉమేష్, రాజు పటేల్, రమేష్ రెడ్డి, రాజు, నరేష్ స్వెన్, రాయలింగు, వెంకటస్వామి, అంబిలపు శ్రీనివాస్, పడాల సంతోష్, పార్వతి సురేష్, పార్వతి రాజేష్, సిద్దార్థ్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
