చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై అనుమానాలు…
క్యాంపు కార్యాలయంలో షాడో ఎమ్మెల్యే వ్యాఖ్యల కలకలం…
వాళ్లు ఏ పార్టీలో ఉంటారోనని అనుమానాలంటూ ఎన్నికల పరిశీలకులపై ప్రశ్నల వర్షం…
గడ్డం ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న హస్తం కార్యకర్తలు…
GADDAM FAMILY : దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా చక్రం తిప్పిన గడ్డం ఫ్యామిలీ ప్రస్తుతం రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోతున్నది. నిలకడలేమి ఆ కుటుంబంపై రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతున్నది. మొన్నటి వెంట ఉన్న వారే దూరం జరుగుతున్నారు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్నా, అది ఇక్కడ ఎందుకు పనికి రాకుండా పోతున్నది.
కాకా కుటుంబం దారెటు..?
ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన కాకా ఫ్యామిలీ… నేడు క్షేత్ర స్థాయిలో చతికిలపడుతోంది. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన కాకా కుటుంబం గతంలో జిల్లా నుంచే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్ర వేసింది. కానీ ప్రస్తుతం కాకా వారసులు మాత్రం రాజకీయంగా పతనమవుతున్నారనే చర్చలు జరుగుతున్నాయి.
అందని మంత్రి పదవి…
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మంత్రి పదవి కోసం కాకా వారసులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. పదవిని దక్కించుకోవడంలో వెనుకపడటమే కాదు, పార్టీ నేతల్లో కూడా వారిపై నమ్మకాన్ని కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో సొంత నియోజకవర్గం నుంచే నేతలే బాహాటంగా విమర్శలు గుప్పించడం వారిని విస్మయానికి గురి చేస్తున్నది.
స్వపక్షంలో విపక్షం…
ఇటీవల జరిగిన అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పరంగా కాకా ఫ్యామిలీకి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సొంత పార్టీ నేతలు సైతం నేడు ప్రత్యర్థులుగా మారుతున్నారు. ఒకప్పుడు దగ్గరుండి కాకా వారసులను గెలిపించిన అనేక కార్యకర్తలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారుతున్నారు. ఇది వారి నాయకత్వ లోపానికి నిదర్శనమని చెప్పవచ్చు. స్వపక్షంలోనే అసంతృప్తి పెరుగుతున్న వేళ, విపక్షాలు మరింత బలపడుతున్నాయి.
సీఎంకు ఫిర్యాదు చేసినా అంతే…
తమ పట్ల పార్టీ నేతల వైఖరిపై గడ్డం వివేక్,వంశీకృష్ణ సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేసినా స్పందన లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు, రాజకీయ సమస్యలు వెల్లడించినా… ఆయన స్పందించకపోవడం వారిపై ఉన్న వైఖరికి నిదర్శనమని పార్టీవర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. తాము పార్టీకి చేసుకున్న సేవలకు సరైన గుర్తింపు లభించకపోవడంపై కుటుంబంలోని పెద్దలే కాదు, వర్గీయులు కూడ మనస్తాపానికి గురవుతున్నారు.
కాకా ఫ్యామిలీ ఆధీనంలో ఉన్న మీడియాలో సొంత పార్టీకి చెందిన మంత్రులపై సైతం విమర్శలు చేయడం, వారికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయడం రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారితీస్తోంది. ఇది వారికే ప్రతికూలంగా మారుతున్నదనే మాట ఎప్పటి నుంచో వినిపిస్తున్నది.
నియోజకవర్గంలో తిరోగమన పరిస్థితులు…
ఇప్పటికే పలుమార్లు పార్టీలు మారిన వివేక్ ఎప్పుడు పార్టీ మారుతాడోననే సొంత పార్టీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షాడో ఎమ్మెల్యేగా చెలామణి అవుతున్న ఓ ముఖ్య నాయకుడు పార్టీ సంస్థాగత సమావేశంలో ఎమ్మెల్యే పార్టీ మారుతాడంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రధాన అనుచరుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో పార్టీ పెద్దల్లోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చేసిన బీఆర్ఎస్ లేదా బీజేపీలో వెళతాడంటూ కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గంలో ప్రచారం చేయడం గమనార్హం. ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించిన నేత ఇప్పుడు షాడో ఎమ్మెల్యేగా మారడం కాకా ఫ్యామిలీకి మైనస్‌గా మారుతున్నది.
రాజకీయంగా భవిష్యత్ ఏమిటి..?
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వివేక్ వెంకటస్వామి రాజకీయ భవిష్యత్ పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయంగా పురోగమించాలంటే ఇప్పటికైనా లోపాలను గుర్తించి, కొత్త మార్గాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని,రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాత ఘనతలు గతమేనని అంగీకరించి, ప్రజలకు దగ్గరవడానికి ప్రాధాన్యతనివ్వాలి. లేకపోతే వారసుల రాజకీయ భవిష్యత్ ను స్వయంగా చేజార్చుకున్నట్లేననని,.ఈ పాత గొప్ప కుటుంబం రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :