- ₹75 లక్షల బకాయిలతో రైతుల ఆందోళన

PATURI SEEDS :శంకరపట్నం మండలం పాటూరి సీడ్ కంపెనీ (PATURI SEED COMPANY) రైతుల చెమటను దోచుకుందని ఆరోపిస్తూ పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. కంపెనీ హామీలను నమ్మి వరి విత్తన సాగు చేసిన రైతులకు చెల్లింపులు చేయకుండా వాయిదాలు వేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు కంపెనీ కార్యాలయం ముందు బైఠాయించి, అక్కడే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. దీంతో కంపెనీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. జనగామ, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లోని వందమందికి పైగా రైతులు గత రబీ సీజన్లో కంపెనీతో ఒప్పందం మేరకు 400 ఎకరాల విస్తీర్ణంలో సీడ్ వరి సాగు చేశామని తెలిపారు. పండిన ధాన్యాన్ని కంపెనీ యాజమాన్యం స్వీకరించిన తరువాత, చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వకుండా రోజు – రోజుకు వాయిదాలే వేస్తోంది అని వారు ఆరోపించారు. మొత్తం రూపాయలు 75 లక్షలు (75 LAKHS) బకాయిగా ఉన్నప్పటికీ ఇప్పటికీ చెల్లింపులపై స్పష్టత ఇవ్వలేదని రైతులు పేర్కొన్నారు.

“మా ధాన్యాన్ని తీసుకున్నారు… డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. పలుమార్లు వెళ్లినా ఒక్కోసారి ఓ కారణం చెబుతూ వాయిదా వేస్తున్నారు. అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నాం,” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ అలసత్వం వల్ల పెద్దఎత్తున నష్టం వాటిల్లిందని, వేరే మార్గం లేక నిరసన చేపట్టాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు తెలిపారు. మాకు రావలసిన డబ్బులు పూర్తిగా చెల్లించిన తరువాతే ఇక్కడినుంచి వెళ్తాం అని రైతులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, బాధితులు పాల్గొన్నారు.
శెనార్తి మీడియా, శంకరపట్నం :
