- సెలవుల్లో ఊళ్లకు వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ సూచనలు
Police Instructions : సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత గ్రామాలు, బంధువుల ఇండ్లకు, లేదా విహారయాత్రలకు వెళ్లే ప్రజలు దొంగతనాల నివారణ కోసం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ సూచించారు. సెలవుల సమయంలో ఖాళీగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసే దొంగతనాలను నివారించేందుకు ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

పోలీస్ కమిషనర్ ప్రకారం, విలువైన ఆభరణాలు, డబ్బులు బ్యాంక్ లాకర్లలో భద్రపర్చడం, లేదా ఇంట్లో రహస్య ప్రదేశాల్లో దాచడం మంచిదని సూచించారు. ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్, సెక్యూరిటీ అలారమ్‌లు అమర్చుకోవడం వల్ల భద్రతను పెంచవచ్చని తెలిపారు.
ఊరికి వెళ్లే వారు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి, వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేయించుకోవాలని సూచించారు. ఇంటి వద్ద సీసీ కెమెరాలు అమర్చడం ద్వారా ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయవచ్చని వివరించారు.
ఇంట్లో ఎవరూ లేకపోతే, ఇంటి ముందు చెత్త, న్యూస్‌పేపర్, పాలప్యాకెట్లు పేరుకావనీయకుండా చూడాలని, పక్కింటి వారికి ఇంటి భద్రతకు సంబంధించి సమాచారం అందించాలన్నారు.
అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. “ప్రజలు అప్రమత్తంగా ఉండి మా సూచనలు పాటిస్తే దొంగతనాలను పూర్తిగా నియంత్రించగలం” అని శ్రీనివాస్ పేర్కొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల/గోదావరిఖని