- మంచిర్యాల వైపు కన్నెత్తి చూడని వివేక్
- ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పంతం నెగ్గించుకుంటున్నాడా?
- నేడు మంచిర్యాలలో డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన
- కానీ జిల్లా మంత్రి మాత్రం ఆదిలాబాద్‌కు !
PSR vs Vivek: తనకు మంత్రి పదవి రాలేదని పార్టీ అధిష్టానంపై బాహాటంగానే అసహనం వ్యక్తం చేశాడు. అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకొని జెండా మోసిన కార్యకర్తలను కాపాడుకుంటే అధిష్టానం ఇచ్చిన బహుమానం ఇదేనా అని ఆవేదన వ్యక్తం చేశాడు. మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కడంతో ఆ ఎమ్మెల్యే అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మంచిర్యాల నియోజకవర్గానికి నేనే బాస్‌ని.. నన్ను కాదని తట్టెడు మట్టి కూడా తీయలేరని, ఎవరో ఇక్కడికి వచ్చి ఏదో చేస్తానంటే ఊరుకునేది లేదని, తన నియోజకవర్గంలో వేలు పెడతానంటే సహించబోమని మీడియా ముఖంగా సవాల్ విసిరాడు ఎమ్మెల్యే పీఎస్సార్. మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి ఉన్నా తన పంతం మాత్రం నెగ్గించుకుంటున్నాడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.
మంత్రి అయితే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ గడ్డం వివేక్ వెంకటస్వామి మంత్రి అయినప్పటి నుంచి సొంత జిల్లాలోని తన పార్టీ ఎమ్మెల్యే ఉన్న మంచిర్యాల నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అదీ జిల్లా కేంద్రంలో ఉన్న నియోజకర్గం వర్గం కావడం గమనార్హం. అయితే ఇక్కడ పార్టీ అంతర్గత కుమ్ములాటలా లేక.. అధిష్టానం ఆదేశాలా అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలింది.
మంత్రి కంటే ఎమ్మెల్యేకు ప్రాధాన్యం!
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బీఆర్ఎస్ హయాంలోనూ తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను కాపాడుకున్నారు. ఖర్గే సభ, భట్టి పాదయాత్ర విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే మంత్రి పదవి మాత్రం చెన్నూ్ర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్కి దక్కడం అసంతృప్తికి దారి తీసినట్లయ్యింది.
‘మంత్రి పదవి నాదే’
కాంగ్రెస్ పార్టీ రాష్ర్టంలో అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి తనదేనని పార్టీలో తాను అనుభవజ్ఞుడనని ప్రేంసాగర్ భావించారు. మంత్రి పదవి కేటాయింపు విషయంలో కానీ తన అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పెద్దలు తీసుకున్న నిర్ణయం పీఎస్సార్‌ను తీవ్ర అసహనానికి గురి చేసింది. మంత్రి పదవి దక్కకున్నా తనపై పెత్తనం చెలాయిస్తానంటే ఊరుకునేది లేదని ముందునుంచీ చెబుతూనే ఉన్నారు పీఎస్సార్.
‘ఇక్కడికి రావద్దు’ అంటూ అల్టిమేటం
ప్రేమ్ సాగర్ రావు వర్గం, అనుచరులు మంత్రి వివేక్ ఈ నియోజకవర్గానికి రాకూడదని హెచ్చరించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఇక్కడికి వస్తే సమస్యలు తలెత్తుతాయని, గొడవలకు దారి తీయవచ్చని తెలుస్తున్నది. ఈ పరిస్థితుల్లో మంత్రి వివేక్ జిల్లా పర్యటనకూ దూరంగా ఉంటున్నారు.
నేడు ముగ్గురు మంత్రుల పర్యటన.. కానీ వివేక్ గైర్హాజరు
ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రాజనర్సింహ మంచిర్యాల జిల్లాకు రానున్నారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. సమావేశాలు జరగనున్నప్పటికీ, మంత్రి వివేక్ మాత్రం హాజరు కావడం లేదు. అదే రోజు మంత్రి వివేక్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లడం విశేషం. దీంతో కాంగ్రెస్ పార్టీలోని విభేదాలు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
వేచి చూడాలి.. అడుగు వేస్తారా?
ప్రస్తుతం పరిస్థితులు చూస్తే మంత్రి వివేక్ మంచిర్యాల నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనల ద్వారా పాపులారిటీ పెంచుకుంటున్న ఆయన, చివరికి తన సొంత జిల్లాకు దూరంగా ఉండాల్సి వస్తుందా? అనే ప్రశ్న వ్యక్తమవుతన్నది. తాను మంత్రి అయినా సొంత జిల్లాలోని నియోజకర్గంలో అడుగుపెట్టకపోవడంపై వివేక్ అసహనానికి గురవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పీఎస్సార్ పార్టీ పెద్దలపై తెచ్చిన ఒత్తిడే ఇందుకు కారణమని తెలుస్తున్నది.
-శెనార్తి మీడియా, హైదరాబాద్
