Prajapalana Sabha: ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల ఆమోదంతోనే అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా జిల్లాలోని హాజీపూర్ మండలం ర్యాలీ, గడ్ పూర్ గ్రామంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, హాజీపూర్ మండల తహసిల్దార్ శ్రీనివాస్ రావు లతో కలిసి లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందజేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రజా సంక్షేమంలో అనేక కార్యక్రమాలు చేపట్టి సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో ప్రజా పాలన, కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాలలో అందిన దరఖాస్తుల ప్రకారంగా అర్హుల జాబితాను రూపొందించి గ్రామ సభలు, వార్డు సభలలో చదివి వినిపించి జాబితాలో రాని అర్హుల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో నూతన రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుండి అమలు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో అర్హులైన లబ్ధిదారులకు సంబంధిత మంజూరు పత్రాలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి పథకాలు అమలు చేయడం జరుగుతుందని, జిల్లాలో హాజీపూర్ మండలం ర్యాలీ-గడ్ పూర్ గ్రామంలో పథకాల అమలులో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
రైతు భరోసా పథకంలో వ్యవసాయ సాగుకు యోగ్యం అయిన భూములకు సంవత్సరానికి 12 వేల అందించడం జరుగుతుందని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పథకంలో 2023-24 సంవత్సరంలో 20 రోజులు, అంతకంటే ఎక్కువ పనిచేసిన వారికి సంవత్సరానికి 12 వేల రూపాయలు అందించడం జరుగుతుందని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకొని ఉండి, ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలో అర్హులైన వారికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని తెలిపారు.
ఇంటి స్థలం కలిగి ఉండి ఇందిరమ్మ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం కొరకు అందించడం జరుగుతుందని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అర్హులైన నిరుపేదలకు పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సభలో పేర్లు రానివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన వారికి ఖచ్చితంగా సంక్షేమ పథకాల ఫలాలు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పథకాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల