SPACE & DEFENCE EXPO : జిల్లా కేంద్రంలోని శ్రీ ఉపోదయ పాఠశాలలో ఇస్రో, డీఆర్డీవో సహకారంతో ఈ నెల 28న సాంకేతిక ప్రదర్శన, శాస్త్రీయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ యార్లగడ్డ బాలాజీ పేర్కొన్నారు. సోమ వారం పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్మా నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్(కేఐవైఈ), యార్లగడ్డ అభిరామ్ మెమోరియల్ గ్రామ సేవా సంయుక్తంగా ఇన్ స్పైర్ ఇండియా – 2025 పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు, భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, భారత రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు జి సతీష్ రెడ్డి, కలెక్టర్ కుమార్ దీపక్ లు ముఖ్య అతిదిగా హాజరవుతున్నట్లు వెల్లడించారు.

దేశ రక్షణ కోసం క్షిపణి వ్యవస్థ, సాంకేతికతను రూపొందించే ప్రక్రియలు, అభివృద్ధి చేసే ప్రయోగాలు, భారత సాయుధ దళాల రక్షణ, సాంకేతికత సంబంధిత అంశాలతో ముఖాముఖి ఉంటుందన్నారు. అంతే కాకుండా అంతరిక్ష రంగంలో దేశ ప్రయోగాలు, విజయాలను శాస్ర్తవేత్తలతో విద్యార్థులు పంచుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి సుమారు ఐదు వేల మంది వరకు విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థులు ఒక రోజు సైన్స్ ఎక్స్ పోను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, పలు పాఠశాలల కరస్పాండెంట్లు, ట్రస్మా జిల్లా, రాష్ట్ర నాయకులు రాపోలు విష్ణు, ఉదారి చంద్రమోహన్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, దుర్గా ప్రసాద్, జాన్ థామస్, ప్రవీణ్, గోనె భాగ్యలక్ష్మి, శరత్, లక్ష్మణ్, ప్రిన్సిపల్ సత్యనారాయణ, రాజానందం తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :