- అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
Biodiversity: జీవ వైవిధ్య పరిరక్షణలో చిత్తడి నేలల పాత్ర అద్వితీయమైనదని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఫిబ్రవరి 2న చిత్తడి నేలల (వెట్ ల్యాండ్స్) పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కొండా సురేఖ తన భావాలను పంచుకున్నారు.
“చిత్తడి నేలలు జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్నాయి. కాలుష్య తీవ్రత కారణంగా పర్యావరణ అసమతుల్యతతో తలెత్తే దుష్ప్రభావాలను అరికట్టడంలోనూ, నీటి నాణ్యతను పెంచడంలోనూ చిత్తడి నేలలు వడపోత వ్యవస్థగా పనిచేస్తున్నాయి. అరుదైన మత్స్య, వృక్షజాతుల జీవనానికి తోడ్పాటునందించడంతో పాటు వరదలను నియంత్రిస్తూ, దేశ, విదేశీ పక్షులకు ఆవాసాన్ని కల్పిస్తూ, చిత్తడి నేలలు ఈ పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. సాగు, తాగు నీటి అవసరాలను తీరుస్తూ మానవాళికి జీవనభద్రతను కల్పిస్తున్నాయి” అని మంత్రి సురేఖ తెలిపారు.
చిత్తడి నేలలకున్న ఈ ప్రాధాన్యత దృష్ట్యా భారతదేశం 1982 లో చిత్తడి నేలల పరిరక్షణకు ఉద్దేశించిన రామ్సార్ కన్వెన్షన్ లో చేరిందని మంత్రి సురేఖ తెలిపారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునెస్కో ఆధ్వర్యంలో ఈ ఏడాది ‘మన భవిష్యత్తు కోసం చిత్తడి నేలల పరిరక్షణ’ అనే నేపథ్యంతో ప్రపంచవ్యాప్తంగా సహజ ఆవాసాలైన చిత్తడి నేలల పరిరక్షణ కోసం అన్ని దేశాలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మంజీర రిజర్వాయర్, పాకాల సరస్సు, కిన్నెరసాని రిజర్వాయర్, రామప్పా సరస్సు, అమీన్ పూర్ సరస్సులను చిత్తడి నేలలుగా గుర్తించినట్లు మంత్రి సురేఖ తెలిపారు. మార్గదర్శకాలను అనుసరించి వీటిని త్వరలోనే నోటిఫై చేస్తామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వున్న చిత్తడి నేలలను గుర్తించి, వాటి పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో రూపొందించనున్న ఎకో టూరిజం పాలసీలోనూ చిత్తడి నేలల సైట్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు. చిత్తడి నేలల పరిరక్షణలో ప్రభుత్వ కృషికి తోడు ప్రజల సహకారం అవసరమని మంత్రి సురేఖ పేర్కొన్నారు.