- బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో టెన్షన్ టెన్షన్
- ‘బుగ్గ’ పరిసర ప్రాంతాలకు పెద్ద పులి
- నాలుగు రోజులుగా కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతాల్లో సంచారం
- రెండో పులిని బీ2 పేర్కొంటున్న అటవీశాఖ అధికారులు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
Cheetha and Tiger: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల అటవీ ప్రాంతంలో నాలుగు రోజులుగా పులుల సంచారం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి దాకా ఒక్క పులి మాత్రమే తిరుగుతుందని అటవీ శాఖాధికారులు భావించారు. ఈ ప్రాంతంలో మరో పెద్ద పులి కూడా తిరుగుతుందని నిర్ధారించారు ఫారెస్ట్ అధికారులు.
బుగ్గ దేవాలయ సమీపంలో సంచరిస్తున్న పులి బీ2 అని పేర్కొంటున్నారు. గురువారం నుంచి కన్నాల-బుగ్గ అడవుల్లో సంచరిస్తున్న ఈ పులి శనివారం కన్నాల ఫారెస్ట్‌లో అడవి పందిపై దాడి చేసి చంపింది. దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై పులి కదలికలను గమనిస్తూ మరింత నిఘా పెంచారు.
-సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా.. రహదారి మూసివేత
పులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు కన్నాల-బుగ్గ రహదారిని మూసివేశారు. డ్రోన్ల సహాయంతో ఎప్పటికప్పుడు పులి కదలికలను గమనిస్తున్నారు. అడవిలోని పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం బీ2 అనే పెద్దపులి బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి అతి సమీపంలో సంచరించినట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. పులి జాడను నిర్ధారించేందుకు మట్టి రోడ్డుపై పాదముద్రలను సేకరించారు.
బుగ్గ దేవాలయంలో అన్నదానం నిలిపివేత
పులి సంచారంతో భక్తులకు ముప్పు పొంచి ఉన్నందున దేవాలయ అధికారులు సోమవారం నిర్వహించాల్సిన అన్నదాన కార్యక్రమాన్ని రద్దు చేశారు. భక్తులు ఆలయానికి రావొద్దని బుగ్గ దేవాలయ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు కోరారు.

చిన్న బుగ్గలో చిరుత, పెద్దపులి సంచారం ..ప్రజల్లో భయం
ఓ వైపు పెద్దపులి సంచారం భయాందోళన రేపుతుండగా, మో వైపు చిన్న బుగ్గ ప్రాంతంలో చిరుత పులి కనిపించడం మరింత కలవరపాటుకు గురి చేస్తున్నది. ఆదివారం చిన్న బుగ్గ అటవీలోని పోలీస్ ఫైరింగ్ రేంజ్ ప్రాంతం చిరుతపులి, సమ్మక్క గద్దెల వద్ద పెద్దపులి కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనితో బెల్లంపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఫారెస్ట్ ఆఫీసర్లు అలర్ట్.. ప్రజలకు హెచ్చరిక
ఫైరింగ్ రేంజ్ ప్రాంతంలో రెండు రకాల పులుల జాడను గుర్తించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో కాజీపేట అటవీ ప్రాంతంలో మేకలపై చిరుత పులి దాడి చేసిన ఘటనల ఆధారంగా, చిరుత కాసిపేట అడవుల నుంచి చిన్న బుగ్గ ప్రాంతానికి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం డ్రోన్ల ద్వారా పులుల కదలికలపై నిఘా పెంచారు. అటవీ మార్గాల్లో వెళ్లకూడదని ప్రజలను హెచ్చరిస్తున్నారు.
పులుల సంచారం అటవీ శాఖ అధికారులకు సవాల్
ప్రస్తుతం కన్నాల-బుగ్గ అటవీ ప్రాంతాల్లో రెండు వేర్వేరు పులుల సంచారం అటవీ శాఖ అధికారులకు సవాలుగా మారింది. వీటిని కట్టడి చేయడానికి మరింత నిఘా చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల