- రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి
MLC ELECTIONS : మెదక్-నిజామాబాద్-కరీంనగర్ ఆదిలాబాద్ నియోజక వర్గాల పట్టభద్రులు(Graduates), ఉపాధ్యాయ(Teachers) ఎమ్మెల్సీ (MLC) ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం(Election Commission) నిబంధనల ప్రకారం ఈ నెల 27న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎన్నికల సంఘం నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా పర్యవేక్షించాలని సూచించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, సి.సి. (CC) కెమెరాలు ఏర్పాటుతో పాటు పోలింగ్ కేంద్రాలలో షామియానా, తాగునీరు, ఫర్నిచర్, వెలుతురు, ఫ్యాన్లు, వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల కోసం ర్యాంప్లు, దివ్యాంగ ఓటర్లకు వీల్ చైర్ ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
25లోగా ఓటరు సమాచార స్లిప్పులను పంపిణీ చేయాలని, ఎన్నికల ప్రక్రియ సజావు సాగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి పోలింగ్ రోజున పాటించవలసిన నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను బందోబస్తు మధ్య రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ కేంద్రానికి తరలించేందుకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లాలో 40 పోలింగ్ కేంద్రాలు – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
జిల్లాలో పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నికలకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికలకు 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసు శాఖ సమన్వయంతో బందోబస్తు ఏర్పాట్లు చేశామని, ప్రతి పోలింగ్ కేంద్రానికి 300 మీటర్ల దూరంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి ప్రచార సంబంధిత అంశాలు లేకుండా పర్యవేక్షిస్తామన్నారు. ఇది వరకు ఓటర్లు, రిజిస్టర్లు, సంతకాలు, పరికరాలు ఇతర అన్ని అంశాలలో ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అధికారుల సమన్వయంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ వీసీలో డి.సి.పి. (DCP) ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీఓ (RDO) లు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, ఎన్నికల పర్యవేక్షకులు ప్రసాద్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల :