Bank of Baroda Recruitment 2025: బ్యాంకింగ్(Banking) రంగంలో కెరీర్ ఎంచుకోవాలని ఆలోచిస్తున్న యువతకు బ్యాంక్ ఆఫ్ బరోడా మంచి అవకాశం కల్పిస్తున్నది. బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) 4000 అప్రెంటిస్ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నియామకానికి సంబంధించిన అర్హతలు మీలో ఉంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025 డ్రైవ్ ద్వారా మొత్తం 4000 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో 1713 పోస్టులు జనరల్ కేటగిరీకి, 980 పోస్టులు ఓబీసీకి, 391 పోస్టులు ఈడబ్ల్యూఎస్, 602 పోస్టులు ఎస్సీ, 314 పోస్టులు ఎస్టీలకు కేటాయించారు.
- విద్యా అర్హత -వయోపరిమితి
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో కొంత మినహాయింపు ఉంటుంది. మరిన్ని వివరాలను నోటిఫికేషన్‌లో చూడవచ్చు .
- దరఖాస్తు చివరి తేదీ
12 నెలల బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 19 ఫిబ్రవరి 2025న ప్రారంభమైంది. జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అర్హత కలిగిన అభ్యర్థులు 11 మార్చి 2025 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష , అడ్మిట్ కార్డుకు సంబంధించిన సమాచారం అధికారిక వెబ్‌సైట్ ద్వారా త్వరలోనే తెలియజేయనున్నది
- ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా భారత ప్రభుత్వ అప్రెంటిస్‌షిప్ పోర్టల్ NAPS లేదా NATS పోర్టల్ https://nats.education.gov.in ని సందర్శించాలి. ఇక్కడ పొందుపర్చిన వివరాలు ఎంటర్ చేసి నమోదు చేసుకోవాలి.
బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు NAPS/NATS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లోపు info@bfsissc.com నుంచి ఈ మెయిల్ అందుకుంటారు, అభ్యర్థి తన వ్యక్తిగత వివరాలు, జిల్లా ఎంపిక, వర్గం, PWBD స్థితి మొదలైన వాటిని నమోదు చేయాల్సిన తుది “అప్లికేషన్ కమ్ ఎగ్జామినేషన్ ఫారమ్” పూరించాలని ఆహ్వానిస్తారు. దీని తరువాత దరఖాస్తు రుసుము డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
- దరఖాస్తు రుసుము:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.600, దివ్యాంగ అభ్యర్థులు రూ.400 దరఖాస్తు రుసుము ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.
- ఎంపిక ప్రక్రియ ఇలా?
ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాష్ట్ర స్థానిక భాషా పరీక్ష ఉంటాయి. 60 నిమిషాల ఆన్‌లైన్ పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి, ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉండదు. పరీక్షలో, జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 చొప్పున ప్రశ్నల అడుగుతారు. మొదటి మెరిట్ జాబితా నుంచి ఎంపిక చేయబడిన అభ్యర్థులు అంగీకరించకపోవడం/రిపోర్టింగ్ చేయకపోవడం గురించి బ్యాంక్ అవసరాలను తీర్చడానికి, రాష్ట్రాల వారీగా లేదా కేటగిరీ వారీగా అర్హులైన అభ్యర్థుల వెయిటింగ్ జాబితా విడుదల చేయబడుతుంది.
- స్టైపెండ్ ఎంతంటే?
అప్రెంటిస్‌షిప్‌నకు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు ప్రతి నెలా స్టైఫండ్ ఇస్తారు. నగర శాఖలలో అప్రెంటిస్‌షిప్ పొందే అభ్యర్థులకు నెలకు రూ. 15,000 స్టైఫండ్ ఇస్తారు. గ్రామీణ శాఖలలో వారికి రూ. 12,000 స్టైఫండ్ ఇస్తారు.
