PDDY
PDDY

PDDY: రైతులకు కేంద్రం భరోసా

  • పీఎం ధన్ ధాన్య యోజనకు కేబినెట్ ఆమోదం

PDDY: రైతాంగానికి ఊతమిచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పీఎం ధన్ ధాన్య యోజన (PDDY) అనే కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 100 వ్యవసాయ జిల్లాలలో ఈ పథకం అమలుకానుండగా, దాదాపు 1.70 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.

ఆరేళ్లకు రూ. 1.44 లక్షల కోట్లు

ఏటా రూ. 24 వేల కోట్లు వెచ్చించనున్నది. 2025–26 నుంచి ఆరు సంవత్సరాల పాటు ఈస్కీంను అమలు చేస్తామని కేంద్ర సర్కారు బుధవారం వెల్లడించింది. వ్యవసాయం, దానికి అనుబంధ రంగాల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించినట్టు తెలిపింది. ఉత్పాదకత తక్కువగా ఉన్న జిల్లాలు, అన్ని రుతువుల్లో సాగు జరగని ప్రాంతాలు, రుణ లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల ఆధారంగా 100 జిల్లాలను ఎంపిక చేయనున్నారు.

పంట వైవిధ్యం, నిల్వల బలోపేతం

ఈ పథకం ద్వారా పంట వైవిధ్యతను ప్రోత్సహించడం, కోత అనంతర నిల్వలు మెరుగుపరచడం, నీటి మౌలిక వసతుల అభివృద్ధి, స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాల లభ్యత పెంపు వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక జిల్లాను ఈ పథకం కింద అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

కమిటీల ఏర్పాటు, పర్యవేక్షణ

పథకం అమలును పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లాలో పథకం పురోగతిని 117 పనితీరు సూచికల ద్వారా క్రమం తప్పకుండా పర్యవేక్షించనున్నారు. దీని ద్వారా రైతులకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుందని ఆయన పేర్కొన్నారు.

గ్రీన్ ఎనర్జీకి ప్రోత్సాహం

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రంగంలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేయడంలో ఇది కీలక ముందడుగు కానుంది.

వ్యోమగామికి అభినందనలు

అంతరిక్ష యాత్ర పూర్తి చేసి భూమికి తిరిగొచ్చిన వ్యోమగామి శుభాంశు శుక్లాకు కేంద్ర మంత్రిమండలి అభినందనలు తెలిపింది. 18 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత విజయవంతంగా భూమిని చేరిన శుక్లాను ప్రత్యేకంగా ప్రశంసించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *