- వాళ్లుంటే బీసీలకు అన్యాయం తప్పదు
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై పెద్ద కుట్ర నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు 10 శాతం కేటాయించడం సరికాదని పేర్కొన్నారు. ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమించబోతోందని హెచ్చరించారు.
బీసీల జనాభా రాష్ట్రంలో 51 శాతం ఉన్నా, కేవలం 32 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలవుతున్నాయని, మిగిలిన 10 శాతం ముస్లింలకు వెళ్తోందన్నారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు వందశాతం రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తోంది అని ఆరోపించారు.
బీసీ సంఘాల నాయకులు రాజకీయాలను పక్కనపెట్టి బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పాలని పిలుపునిచ్చారు. బీ
సీ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ముస్లింలను జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బీసీలకు పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేశారు. కేంద్రంతో మాట్లాడి ఆమోదం పొందే బాధ్యతను తామే తీసుకుంటామని వెల్లడించారు.
బనకచర్ల ప్రాజెక్టుపై రేపు జరిగే రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సమానంగా న్యాయం చేస్తుందని అన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్, మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
