- కరీంనగర్ సిటీలో ట్రిపుల్ రైడింగ్ కేసులే ఎక్కువ
Traffic surveillance: కరీంనగర్ సిటీలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల నిఘా ముమ్మరంగా సాగుతోంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వల్ల నిబంధనలు పాటించని వాహనదారులపై చలాన్ల మోత మోగుతోంది. జూన్ 27 నుంచి జూలై 17 వరకు కేవలం 21 రోజుల్లో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన 13,869 కేసులు నమోదయ్యాయి. వీటిపై రూ.1,13,43,400 ఫైన్లు విధించారు.
ఈ కేసుల్లో అత్యధికంగా ట్రిపుల్ రైడింగ్ కేసులే నమోదయ్యాయి. మొత్తం 8,808 ట్రిపుల్ రైడింగ్ ఘటనలు నమోదు కాగా, ఒక్కో టూవీలర్‌కు రూ.1,200 చొప్పున రూ.1,05,69,600 జరిమానా విధించారు. ట్రిపుల్ రైడింగ్ చేస్తోన్న వారిలో యువతే ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ట్రిపుల్ రైడింగ్ తర్వాత ఎక్కువగా నమోదైన ఉల్లంఘనలు సీట్‌బెల్ట్ లేకుండా కార్లు నడిపినవే. ఈ నిబంధనను ఉల్లంఘించిన 3,437 మందిపై రూ.3,43,700 చలాన్లు విధించారు. అదే విధంగా సెల్‌ఫోన్‌తో మాట్లాడుతూ డ్రైవింగ్ చేసిన 251 మందిపై ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున రూ.2,51,000 జరిమానాలు విధించారు.
రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసిన 418 మందిపై రూ.83,600 జరిమానాలు వేశారు. జూన్ 27న హెల్మెట్ లేకుండా బైక్ నడిపిన 955 మందిపై రూ.95,500 జరిమానా విధించారు. ప్రస్తుతం హెల్మెట్, ఓవర్ స్పీడ్ ఉల్లంఘనలపై చలాన్లు జారీ చేయడం లేదు. అయితే త్వరలోనే ఇతర శాఖలతో సమన్వయం చేసి వాటిపై కూడా చర్యలు ప్రారంభిస్తామని కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన 769 సీసీ కెమెరాలు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానంగా పనిచేస్తున్నాయి. అక్కడి నుంచే నగరంలోని ట్రాఫిక్‌పై పర్యవేక్షణ కొనసాగుతోందని, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి, పోలీసులకు సహకరించాలని, పౌరుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని కమిషనర్ గౌస్ ఆలం స్పష్టం చేశారు.
-శెనార్తి మీడియా, కరీంనగర్
