PMSBY:పేద, మధ్యతరగతి ప్రజలు ప్రమాదాల బారిన పడినప్పుడు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనను ప్రవేశపెట్టింది. పోస్టాఫీసులు, బ్యాంకుల ద్వారా అమలు చేస్తున్నప్పటికీ ఈ పథకం గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది.
ఈ పథకంలో వార్షిక ప్రీమియం కేవలం రూ.20 మాత్రమే. ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత వికలాంగత పొందిన వ్యక్తి నామినీకి రూ.12 లక్షల వరకు బీమా పరిహారం అందుతుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C, సెక్షన్ 10 కింద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.
ఈ పథకానికి భారతీయ పౌరుడై ఉండటం, బ్యాంకు లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండటం అర్హత ప్రమాణాలు. ఆ ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం కావాలి. వయసు 10 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉండాలి. అనేక ఖాతాలు ఉన్నప్పటికీ ఒక్క ఖాతా ద్వారానే ఈ పథకంలో చేరవచ్చు. నేరుగా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. ఆటో రెన్యువల్ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఖాతా నుంచి రూ.20 కట్ అవుతుంది.
క్లెయిమ్ పొందడానికి సంబంధిత ఫారమ్ నింపి బ్యాంకుకు సమర్పించాలి. ప్రమాదం లేదా మరణానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ ప్రతిని పోలీస్ స్టేషన్ నుంచి పొందాలి. ఆ తరువాత బీమా మొత్తం నామినీ బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది. పాలసీ గడువు జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుంది.
