- ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు
- పది రోజుల తర్వాత 340 బస్తాలు రాక
- పెద్ద సంఖ్యలో చేరుకున్న అన్నదాతలు
Kannapur Godown: శంకరపట్నం మండలం మెట్ పల్లి పీఏసీఎస్ పరిధిలో రైతులు ఎరువుల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజుల తర్వాత 340 ఎరువుల బస్తాలు కన్నాపూర్ గోదాముకు చేరడంతో సోమవారం కన్నాపూర్, ధర్మారం, ముత్తారం, అర్కం డ్ల గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఒక్కసారిగా రైతులు అధిక సంఖ్యలో రావడంతో గోదాం ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఎరువుల కోసం రైతులు ఉదయం నుంచి క్యూలో నిలబడి ఎరువుల బస్తా కోసం నిరీక్షించారు. పది రోజుల క్రితం రైతులు తమ చెప్పులు క్యూలో పెట్టి ఎరువుల బస్తాల కోసం క్యూలో నిల్చున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ‘శెనార్తి మీడియా’ తో పలువురు రైతులు మాట్లాడుతూ, పంటలకు అత్యవసరమైన ఎరువులు అందుబాటులో లేకపోవడం వల్ల పంటల పెరుగుదల దెబ్బతింటోందని, సమయానికి ఎరువులు అందకపోతే దిగుబడులు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువుల సరఫరా తక్కువగా ఉండటంతో అందరికీ సరిపడా అందడం లేదని వాపోతున్నారు. వెంటనే పంటలకు సరిపడా ఎరువుల బస్తాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. పంటల సీజన్లో ఎరువుల కొరత రాకుండా ముందుగానే సరఫరా చర్యలు తీసుకోవాలని కోరారు.
-శెనార్తి మీడియా, శంకరపట్నం
