- టీచర్స్ 89.92%, గ్రాడ్యుయేట్స్ 64.64% నమోదు…
- మార్చి మూడున ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు…
MLC ELECTIONS : కరీంనగర్ జిల్లాలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించిన పోలింగ్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు సమర్థంగా ఎన్నికలను నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ సరళిని పర్యవేక్షించారు. కరీంనగర్లోని డాక్టర్ స్ట్రీట్లో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అధికారులను ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

కరీంనగర్ జిల్లాలో 71,545 మంది పట్టభద్రులు, 4,305 మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 103 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. అన్ని జిల్లాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసి, 24 గంటల నిఘా ఏర్పాటు చేశారు.
పోలింగ్ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముక్రంపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో క్యూ లైన్లో నిల్చొని ఓటేశారు. ఇదే పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులకు, ఎన్నికల సిబ్బందికి అభినందనలు తెలిపారు.
కరీంనగర్ జిల్లా పోలింగ్ రిపోర్ట్ ఇలా…
- గ్రాడ్యుయేట్స్ : కరీంనగర్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 71,545 (పురుష ఓటర్లు 42,806, మహిళా ఓటర్లు 28,739) మంది ఉండగా 46,247 (పురుషుల ఓటర్లు 28,012, మహిళా ఓటర్లు 18,235) మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓట్ల పోలింగ్ శాతం 64.64 గా నమోదైంది.
- టీచర్స్ : కరీంనగర్ జిల్లాలో 4305 (పురుషుల ఓటర్లు 2663 , మహిళా ఓటర్లు 1642 ) మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 3871 ( పురుష ఓటర్లు 2409, మహిళా ఓటర్లు 1462 ) మంది ఉపాధ్యాయ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ ఎన్నికల పోలింగ్ శాతం 89.92 గా నమోదైంది.

మూడో తేదీన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు…
మార్చి మూడు సోమవారం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కరీంనగర్ లోని బీఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపడుతున్నారు. కౌంటింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించడానికి ఇప్పటికే అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి సూచనలు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరగనుంది.
-శెనార్తి మీడియా, కరీంనగర్ :
