- జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్
AWARENESS OF DRUGS : యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, చెడు అలవాట్లకు ఆకర్షితులై బంగారు భవిష్యత్తును కోల్పోవద్దని జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ అన్నారు. బుధవారం నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా మహిళ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా యాంటీ డ్రగ్స్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎక్సైజ్ ఎస్ఐ మనీషా రాథోడ్, నస్పూర్ ఎస్ఐ సుగుణాకర్, జిల్లా బాలల సంరక్షణ అధికారి ఆనంద్ లతో కలిసి మాట్లాడారు. బాల బాలికలు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు.
డ్రగ్స్ తీసుకోవడం వలన భవిష్యత్తు నాశనం అవుతుందని, ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లయితే డ్రగ్స్ హెల్ప్ లైన్ (14446) ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. డ్రగ్స్ తీసుకోవడం వలన భవిష్యత్తులో తలెత్తే సమస్యలను వివరించారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేయించారు. యాంటీ డ్రగ్స్ సంబంధిత వీడియోలను స్క్రీన్ పై ప్రదర్శించి యాంటీ డ్రగ్స్ అంశంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి ఫర్జానా, జిల్లా హెడ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ సమన్వయకర్త సౌజన్య, జెండర్ స్పెషలిస్ట్ విజయ, చైల్డ్ లైన్ సమన్వయకర్త ప్రేమ్‌కుమార్, సురేష్, సఖి కేంద్రం, పారామెడికల్ రమ, కళాశాల యంత్రాంగం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల :