నస్పూర్ లో నకిలీ ముఠా.. అరెస్టు చేసిన పోలీసులు
Fraud Occult Worship: మంచిర్యాల జిల్లా నస్పూర్ లో క్షుద్రపూజల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయ్యింది. మంచిర్యాలకు చెందిన మాదంశెట్టి ప్రభంజన్ అనే యువకుడిని లక్ష్యంగా చేసుకున్నారు. తాంత్రిక పూజలు చేస్తే కోట్లలో సంపాదన వస్తుందని నమ్మించి, రూ. 2 లక్షలు వసూలు చేసినట్లు నస్పూర్ పోలీసులు తెలిపారు.
శుక్రవారం రాత్రి నస్పూర్ హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన ఈ ఘటనలో పూజల పేరుతో ముఠా సభ్యులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తుండడాన్ని బాధితుడు గుర్తించాడు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకొని నేరుగా పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు నస్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి, ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్టు చేశారు. అయితే ఈ ముఠాకు చెందిన మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. క్షుద్రపూజల పేరిట ప్రజలను మోసం చేసే ఈ ముఠా కార్యకలాపాలను పూర్తిగా విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. క్షుద్రపూజల పేరిట చెప్పే మాయమాటలు నమ్మొద్దని, పోలీసులు సూచిస్తున్నారు. ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
