- వృద్ధులకు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలి
- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Karimnagar Collector: వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం–2007 ప్రకారం ట్రిబ్యునల్ ఇస్తున్న ఉత్తర్వులు సమర్థవంతంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వృద్ధులకు, తల్లిదండ్రులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు, రెవెన్యూ, పోలీస్ అధికారులు, సఖి కేంద్ర ప్రతినిధులతో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోవడం లేదని, శారీరక–మానసిక హింసకు గురి చేస్తున్నారని, బలవంతంగా ఆస్తి పత్రాలపై సంతకాలు చేయిస్తున్నారని ట్రిబ్యునల్ కు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వాదోపవాదాల అనంతరం ట్రిబ్యునల్ వృద్ధుల పోషణకు మెయింటెనెన్స్ సొమ్ము చెల్లించాలని ఆదేశిస్తున్నప్పటికీ కొంతమంది ఆ ఉత్తర్వులను ఒకటి రెండు నెలలకే బేఖాతరు చేస్తున్నారని పేర్కొన్నారు.
దీంతో తల్లిదండ్రులు కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను నివారించేందుకు జిల్లా సంక్షేమ శాఖ, రెవెన్యూ, పోలీస్, సఖి కేంద్రాల నుంచి బృందాలను ఏర్పాటు చేసి ట్రిబ్యునల్ ఉత్తర్వుల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వృద్ధుల పరిస్థితులను ఆ బృందం పర్యవేక్షించి నివేదిక సమర్పించాలన్నారు.
అలాగే వృద్ధుల కేసులకు సంబంధించి ప్రతి శనివారం ట్రిబ్యునల్ విచారణ సమయంలో ఒక పోలీస్ అధికారిని విధులు నిర్వర్తించేలా కమిషనర్ కు సూచించారు. ట్రిబ్యునల్ ఆదేశించిన విధంగా మెయింటెనెన్స్ సొమ్ము తల్లిదండ్రులకు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాలను వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు స్వాగతించారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్, డీసీహెచ్ఎస్ కృష్ణ ప్రసాద్, అడిషనల్ డీఆర్డీఓ రవికిరణ్, కమిటీ సభ్యులు కేశవరెడ్డి, జనార్దన్ రావు, రామేశం, రాధ పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, కరీంనగర్
