- బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం
- మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్
Korukanti: తెలంగాణలో బీసీలను అణచివేసేందుకే కాంగ్రెస్ కులగణన పేరుతో కుట్రలు పన్నుతోందని, బీసీ వర్గాలకు అన్యాయం చేస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల జనాభాను తగ్గించి, ఓసీల సంఖ్యను పెంచేలా సర్వే నిర్వహించారని ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కుల గణన సర్వే పూర్తిగా తప్పుల తడకగా మారిందని, బీసీల హక్కుల కోసం ఉద్యమం తప్పదన్నారు.
14న బీసీ రౌండ్ టేబుల్ సమావేశం
ఈ నెల 14న గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బీసీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కోరుకంటి చందర్ తెలిపారు. బీసీ ఉపకులాల ప్రతినిధులు, నాయకులు అందరూ హాజరై తమ హక్కుల కోసం గొంతెత్తాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ కుట్రలపై తీవ్ర విమర్శలు
కుల గణన సర్వే ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని, దాదాపు 22 లక్షల మంది బీసీలను లెక్కలోకి తీసుకోలేదని ఆయన ఆరోపించారు. బీసీల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని, సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అండ
బీసీలకు న్యాయం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ముందంజలో ఉందని, పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో 50% సీట్లు బీసీలకు కేటాయించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్నేనని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో 24 గంటల్లో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించారని, అలాంటి సర్వే మళ్లీ జరగాలని కోరారు.
ఈ సమావేశంలో గోపు ఐలయ్య యాదవ్, బొడ్డు రవీందర్, బోడ్డుపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, అచ్చ వేణు, కల్వచర్ల కృష్ణవేణి, సట్టు శ్రీనివాస్, అల్లం అయులయ్య, సంధ్యారెడ్డి, కోడి రామకృష్ణ, వెంకన్న, కిరణ్ జీ, సారయ్య నాయక్, వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, గోదావరిఖని
