- పొరుగు రాష్ట్రం నుంచి రాత్రివేళలో అక్రమంగా ధాన్యం డంపింగ్
- కోటపల్లి గుండా చెన్నూర్ కు తరలింపు
- కత్తరసాల పీఏసీఎస్ కేంద్రంలో వెలుగు చూసిన దళారుల దందా
- స్థానిక రైతుల పేరిట కొనుగోళ్లు
- రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కత్తెరసాల రైతులు
- చెన్నూర్ పోలీస్ స్టేషన్‌లో లారీ అప్పగింత
Paddy Corrruption: మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అధికారులు, అధికార పార్టీ నాయకులు స్థానిక రైతులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఈ సంఘటన తేటతెల్లం చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలో నెల రోజులుగా వడ్ల కొనుగోళ్లు సాగుతున్నాయి. ఒక్కో కేంద్రంలో దాదాపు 20 రోజులకు పైగా స్థానిక రైతుల వడ్లు అలాగే ఉంటున్నాయి. అధికారులను అడిగితే లారీల కొరత, హమాలీ కొరతతో పాటు కేటాయించిన మిల్లుల్లో అన్ లోడింగ్ కు హమాలీల కొరత అంటూ సాకులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

జిల్లాకు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కొందరు దళారులు వడ్లను కోటపల్లి మండలం గుండా చెన్నూర్ మండలానికి తరలిస్తున్నారు. స్థానిక రైతుల వడ్లుగా చూపుతూ ఇక్కడి కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తున్నారు. ఈ అక్రమ దందాకు అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నాయకులు అండగా ఉన్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. పక్క రాష్ర్టం నుంచి తెచ్చిన వడ్లను ఇక్కడి కేంద్రాల్లో కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఇక్కడి రైతుల వడ్లు స్థానిక కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 15 నుంచి 20 రోజులకు పైగా అలాగే ఉండిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. వర్షాలు వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
స్థానిక రైతులకు అన్యాయం
మహారాష్ర్ట నుంచి వడ్లు తీసుకొచ్చి జిల్లా సరిహద్దు మండలాలైన కోటపల్లి, చెన్నూర్ మండలాల్లో విక్రయిస్తుండడంతో స్థానిక రైతులకు అన్యాయం జరుగుతున్నది. కొందరు అధికారులు, అధికార పార్టీ నాయకుల ధనదాహం మూలంగా స్థానిక రైతులు నష్టపోతున్నారు. 20 రోజులవుతున్నా తమ వడ్లు కొంటలేరు అని రైతులు వాపోతున్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలులో జాప్యంపై మీడియాలో కథనాలు వస్తుండడంతో అధికారులు ఆయా కేంద్రాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ముందస్తుగా అధికారుల పర్యటన సమాచారం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఇస్తున్నారు. ఆయా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులను మేనేజ్ చేస్తున్నారు. కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని రైతులతో చెప్పిస్తున్నారు. అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నాయకుల కుయుక్తులు తెలియని అమాయక రైతులు షరా మామూలుగానే మోసపోతున్నారు.

ఇదే ప్రత్యక్ష సాక్ష్యం
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కత్తరశాల గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రానికి శనివారం అర్ధరాత్రి దాటాక ఓ లారీ వచ్చింది. అందులోకి ఓ బొలెరో వాహనాల నుంచి వడ్ల బస్తాలను లారీలో లోడ్ చేస్తుండగా స్థానిక రైతులు గుర్తించారు. రైతులను చూసి డ్రైవర్ సెంటర్ నుంచి లారీని సెంటర్ నుంచి తీసుకెళ్తుండగా స్థానిక రైతులు వెంబడించి పట్టుకున్నారు. చెన్నూర్ పోలీస్ స్టేషన్ లో లారీని అప్పగించారు. ఈ సందర్భంగా సదరు రైతులు మాట్లాడుతూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడితో పాటు మరికొందరు కలిసి అక్రమంగా వడ్ల దందా చేస్తున్నారని ఆరోపించారు. పొరుగున ఉన్న మహారాష్ర్టలో నుంచి రూ.1800 నుంచి 1900 వరకు వడ్లు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకవస్తున్నారని ఆరోపించారు. స్థానిక రైతుల పేరిట కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తున్నారని ఆరోపించారు. 20 రోజలుగా మా వడ్లు ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. అర్ధరాత్రి దాటాక కొనుగోలు కేంద్రానికి లారీలో ధాన్యం ఎలా నింపారని ప్రశ్నించారు. అధికారులు, అధికార పార్టీ నాయకుల అండతోనే వడ్ల దందా చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ నెల 27 దాకా వర్షాలు ఉన్నాయంటున్నారని, ఇప్పటికే 20 రోజులుగా కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాల శ్రమించి పంటలు సాగు చేస్తున్న రైతులను దళారుల దందాకు బలి చేయొద్దని జిల్లా కలెక్టర్, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కోరుతున్నారు.

ఈ విషయమై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మ రావును వివరణ కోరగా రైతులు లారీని పట్టుుకున్న విషయం తన దృష్టికి రాలేదని, తెలుసుకొని చెబుతానని తెలిపారు. కాగా జిల్లా అదనపు కలెక్టర్ ను శెనార్తి మీడియా ఫోన్ లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
