కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
Oilpalm Cultivation: రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని, ఈ సాగులో ఆయిల్ పామ్ కు ప్రాధాన్యమివ్వాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై లోహియా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని కె.ఎస్.ఎల్ గార్డెన్ లో శనివారం “బంగారు రైతు” అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరై మాట్లాడుతూ కేవలం వరి మాత్రమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని అన్నారు. డిమాండ్ ఎక్కువగా ఉండి ఉత్పత్తి తక్కువగా ఉండే పంటలపై దృష్టి పెట్టాలన్నారు. ఒక సీజన్లో వరి వేస్తే మరో సీజన్లో ప్రత్యామ్నాయ పంట వేయాలని సూచించారు. ప్రత్యామ్నాయ పంటలలో ఆయిల్ ఫాం సాగు ప్రయోజనకరమైనదని తెలిపారు. ఈ పంటలో అంతర పంట కూడా సాగు చేయవచ్చని అన్నారు. మూడు సంవత్సరాల పాటు కష్టపడితే 30 సంవత్సరాల నికర ఆదాయం ఈ పంట ద్వారా చేకూరుతుందని తెలిపారు.
ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం నాలుగు సంవత్సరాలకు గాను ఎకరానికి 51 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతీ ఎకరాకు రూ. 22,500 సబ్సిడీ బిందు సేద్యం కోసం అందిస్తున్నదని చెప్పారు. జిల్లాలో కేవలం 320 మంది రైతులు మాత్రమే 1200 ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు చేస్తున్నారని అన్నారు. ఈ సాగు విస్తీర్ణాన్ని ఈ ఏడాది 3000 ఎకరాల వరకు విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయిల్ ఫామ్ ద్వారా రైతులు లాభాలను అర్జించవచ్చని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, లోహియా సంస్థ సీఈవో సిద్ధాంత్ లోహియా, ప్రతీక్ పట్నాయక్ పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, కరీంనగర్

