అభివృద్ధి పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ పమేలా సత్పతి
Sports School: కరీంనగర్‌లోని రీజినల్ స్పోర్ట్స్ స్కూల్‌ను రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.శనివారం సాయంత్రం ఉజ్వల పార్కు సమీపంలో ఉన్న రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ అభివృద్ధి పనులను కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ స్కూల్ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్పోర్ట్స్ స్కూల్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా ఫెన్సింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని సూచించారు. క్రీడాకారులకు ఉత్తమ వాతావరణం కల్పించేందుకు స్కూల్ పరిసరాల్లో ఆకర్షణీయమైన మొక్కలు నాటాలని, స్కూల్ ప్రాంగణంలో ఫౌంటెన్ ఏర్పాటు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్ పరిసరాల్లోనూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పచ్చగా మార్చాలని పేర్కొన్నారు.
“కరీంనగర్ జిల్లా స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారులకు తలమానికంగా నిలవాలి. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చేందుకు అనువైన వాతావరణం, సదుపాయాలు కల్పించాలి,” అని జిల్లా కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోనే మోడల్‌గా కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. అవసరమైన అన్ని రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం అందిస్తుందని ఆమె భరోసా ఇచ్చారు.
విద్యార్థులు క్రీడా రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, ఇందుకోసం వారికి అవసరమైన శిక్షణ, వసతులు సమకూర్చేందుకు అధికార యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధి పనులు ఈ దిశగా ముందుకెళ్లడం సంతృప్తికరమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, పీఆర్‌డీఈ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, కరీంనగర్