PROTEST : ఎన్నికలలో ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పాలించడం చేతకాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కుట్రలను పన్నుతున్నారని మంచిర్యాల కార్పొరేషన్ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంచిర్యాల మాజీ ఎంఎల్ఏ నడిపెల్లి దివాకర్ రావు ఆదేశాల మేరకు మంగళ వారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం మాని కాలయాపన కోసం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం లేనిపోని అబద్దపు ప్రచారాలు చేస్తు కాలం వెల్లదీస్తున్నారన్నారు. వారి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వారికి ప్రజాక్షేత్రంలో బుద్ది చెబుతామన్నారు. బీఆర్ఎస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గాదె సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ బీఆర్ఎస్ నాయకులు బేర సత్యనారాయణ, వంగ తిరుపతి, సుబ్బయ్య, కాటం రాజు, తోట తిరుపతి, హైమద్, పట్టణ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
