- పెరిగిన చెల్లని ఓట్ల సంఖ్య
- అభ్యర్థులకు తలనొప్పిగా మారిన పరిస్థితి
MLC ELECTIONS : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఆశ్చర్యకరమైన మలుపులు తిరుగుతోంది. మొదటి దశ నుంచే చెల్లని ఓట్లు అధికంగా నమోదు కావడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. విజయం తమదేనని భావించిన వారు లెక్కింపు ప్రారంభం నుంచే డిఫెన్స్‌లో పడిపోయారు. గత ఎన్నికల్లో లక్ష 40 వేల ఓట్లు పోలైతే, దాదాపు 20 వేల ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. ఈసారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
ఫిబ్రవరి 27న కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీకి 70 శాతం ఓటింగ్ నమోదుకాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 90 శాతం పోలింగ్ నమోదైంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన లెక్కింపులో మొదటి దశలోనే 10 శాతం ఓట్లు చెల్లనివిగా తేలాయి. 320 పోలింగ్ బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ పత్రాలను పరిశీలించగా, ఒక్కో బూత్‌లో 90 నుంచి 100 వరకూ చెల్లని ఓట్లు ఉన్నట్లు గుర్తించారు.

సోషల్ మీడియాలో ప్రచారం చేసినా…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎన్నికల సిబ్బంది ఇచ్చిన పెన్ను మాత్రమే ఉపయోగించాలని, మొదటి ప్రాధాన్యత వ్యక్తికి 1, తర్వాత 2, 3 ఇలా వేయాలని సూచనలు ఇస్తూ, ప్రాధాన్యత ఓటింగ్ విధానం గురించి స్పష్టమైన సమాచారం అందించినప్పటికీ, ఓటర్లు అనేక పొరపాట్లు చేశారు. కొందరు బ్యాలెట్ వెనుక ప్రాధాన్యతను గుర్తించకుండా మార్క్ చేయగా, మరికొందరు నిరసన వ్యక్తం చేస్తూ రైతు బంధు, ప్రభుత్వ విధానాల గురించి రాయడం కొసమెరుపు.
అభ్యర్థుల నిరాశ…
చెల్లని ఓట్ల సంఖ్య అధికంగా ఉండటంతో అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్లకు సరైన అవగాహన కల్పించడంలో ఎన్నికల అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ, కొంతమంది రీ-ఎలక్షన్ డిమాండ్ చేశారు. కౌంటింగ్ హాల్లో అభ్యర్థులు, ఏజెంట్లు, ఎన్నికల అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఉత్కంఠ భరితంగా లెక్కింపు…
ప్రస్తుతానికి లెక్కింపు కొనసాగుతోంది. చెల్లని ఓట్లు అధికంగా ఉండటంతో గెలుపోటములపై అంచనాలు వేయడం కష్టంగా మారింది. చివరి విడత కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎన్నికల ఫలితం ఊహించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు చెల్లనివిగా తేలిన ఓట్లలో 1, 2 లాంటి సంఖ్యలు రాసిన వాటిని కూడా పరిగణించాల్సిందిగా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవిందర్ సింగ్ కోరారు.
– శెనార్తి మీడియా, ప్రత్యేక ప్రతినిధి :
