- దళితుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిన్నచూపు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
- మంచిర్యాలలో పర్యటించిన జాగృతి అధ్యక్షురాలు
- కవిత వెంట రాని బీఆర్ఎస్ నాయకులు
- కవిత ఫ్లెక్సీల్లో కనిపించని కేటీఆర్ ఫొటో
MLC Kavitha: బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్‌ను వెంటనే నిలిపివేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ప్రాంతంలో జాగృతి నాయకుడు కందుల ప్రశాంత్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నందున, ఆయనను ఇంటి వద్ద కలిసి పరామర్శించారు.
తర్వాత, తన కార్యాలయ సిబ్బంది ప్రవీణ్ కళ్యాణం వేడుకలో పాల్గొన్న కవిత, కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం మంచిర్యాల గౌతమ్ నగర్లో అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మునీర్( Senior Journalist Muneer) కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
ప్రెస్ మీట్లో మాట్లాడిన కవిత, “సీనియర్ జర్నలిస్టు మునీర్ మృతి బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని అన్నారు. నంబాల కేశవరావు మృతి చెందినప్పుడు కుటుంబానికి మృతదేహాన్ని కూడా పోలీస్‌లు ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో కుల రాజకీయాలు ఊపందుకున్నాయని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్న వర్గ నాయకులను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్టలో డిప్యూటీ సీఎం భట్టిని అవమానించినట్టుగానే, సరస్వతీ పుష్కరాలకు ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం ద్వారా కూడా కాంగ్రెస్ దళితులను అవమానించిందన్నారు.
కవిత పర్యటనలో బీఆర్ఎస్, బొగ్గుగని కార్మిక సంఘాల నాయకులు ఎవరూ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు. మరో వైపు కవిత అనుచరులు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటో పెట్టకపోవడం గమనార్హం.
-శెనార్తి మీడియా, మంచిర్యాల
