- ఉన్నతాధికారులు వస్తేనే దర్శనమిస్తున్న బెడ్ షీట్స్
- కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న రోగులు
- అధికారులు నిత్యం సందర్శిస్తేనే పేషంట్లకు మెరుగైన సేవలు
Mancherial GGH: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో బెడ్ షీట్స్ మళ్లీ కనిపించడం లేదు. ప్రభుత్వ దవాఖానలో బెడ్ షీట్ల కొరతపై ఇటీవల ‘శెనార్తి మీడియా’ లో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. స్పందించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్వయంగా దవాఖానను సందర్శించి హాస్పిటల్ లోని సౌకర్యాల గురించి వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని రోగులు భావించారు. కానీ కలెక్టర్ విజిట్ కు వచ్చి వారం గడవక ముందే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఎప్పటి లాగే మళ్లీ బెడ్ షీట్లు కనిపించడం లేదు. గత్యంతర లేక పేషంట్లే స్వయంగా బెడ్ షీట్లు తెచ్చుకుంటున్నారు.
అయితే గవర్నమెంట్ హాస్పిటల్ లో బెడ్ షీట్ల గోల్ మాల్ ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారతున్నది.. హాస్పిటల్ కు 300 పైగా బెడ్ షీట్స్ సరఫరా చేశామన్న కలెక్టర్ కుమార్ దీపక్ స్వయంగా మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే జిల్లా పాలనాధికారిని కూడా హాస్పిటల్ అధికారులు, సిబ్బంది పక్కదారి పట్టిస్తున్నారనే విషయం స్పష్టమవుతున్నది
జర్నలిజం సర్టిఫికెట్.. ఐడీ చూపెట్టాలట: సూపర్ వైజర్ కుసుమ అనిత హుకూం..
రాత్రి పూట ఆసుపత్రిలోని పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై నైట్ డ్యూటీ సూపర్‌వైజర్ కుసుమ అనిత మండిపడ్డారు. పేషంట్లకు బెడ్ షీట్స్ ఇవ్వడం లేదా అని అడిగితే ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఐడీ కార్డులు చూపించాలంటూ దబాయించారు. మీరు జర్నలిజం ఎక్కడా చేశారు.. సర్టిఫికెట్లు చూపించాలంటూ ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాల్సిన నర్సింగ్ సిబ్బంది, మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నిస్తే ఇలా తిరగబడడంపై అక్కడున్న రోగులు నివ్వెరపోయారు
కలెక్టర్ వస్తేనే బెడ్ షీట్స్ కనిపిస్తయ్
రోగులకు అందించాల్సిన బెడ్ షీట్స్ జిల్లా కలెక్టర్ హాస్పిటల్ ను విజిట్ చేసినప్పుడు మాత్రమే మాత్రమే కనిపిస్తాయా..? లేక అధికారుల కనుసన్నల్లో వాటిని దాచేస్తున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నైట్ డ్యూటీలో కనిపించడని హెడ్ నర్సుల జాడ
ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన సేవలు అందించాల్సిన హెడ్ నర్సులు, కీలక సమయాల్లో కనిపించకపోవడం ఆసుపత్రి నిర్వహణ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సూపరింటెండెంట్ రూమ్ లో ఎప్పుడూ అడిగిన “వీక్ ఆఫ్” అనే సమాధానం వస్తోంది. మరి, రాత్రి వేళల్లో ఎవరు బాధ్యత వహిస్తున్నారు..? పెత్తనం అంతా నైట్ డ్యూటీ సూపర్ వైజర్లపై పెట్టింది ఎవరో తేలాల్సి ఉంది.
ఫొటోలు తీస్తే డోర్లు వేసిన సూపర్ వైజర్
తమకు బెడ్ షీట్స్ ఇవ్వడం లేదని పలువురు రోగులు మీడియా ప్రతినిధుల దృష్టికి తీసుకు రాగా, దవాఖానను సందర్శించారు. మీడియా ప్రతినిధులను చూసిన ఆసుపత్రి సిబ్బంది తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు, నర్సింగ్ సూపర్ వైజర్ కుసుమ అనిత (supervisor kusuma) నర్సింగ్ సూపరింటెండెంట్ రూమ్ లోపలికి డోర్ వేసుకున్నారు. పదే పదే దవాఖానను ఎందుకు విజిట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు.

“ఆ నర్స్ ఎవరో నాకు తెలియదు: ఆసుపత్రి సూపరింటెండెంట్ హరీష్ చంద్రా రెడ్డి
ఈ విషయం గురించి సూపరింటెండెంట్ హరీష్ చంద్ర రెడ్డిని ప్రశ్నించగా “ఆ నర్స్ ఎవరో నాకు తెలియదు” అంటూ స్పందించారు. తెలుసుకొని మీకు మళ్ళీ చెప్తాను అని అనడం వెనుక ఆయన నిర్లక్ష్యం ఏమిటో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆ నైట్ డ్యూటీ సూపర్ వైజర్ “రేపు ఉదయం రండి, నా ఐడీ కార్డు పది జిరాక్సులు ఇస్తాను” అంటూ మరింత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది ఆసుపత్రి లో సిబ్బంది వైఖరి.

సేవలు అందించడంలో నిర్లక్ష్యం
” నైట్ డ్యూటీ సూపర్ వైజర్ నర్సు కుసుమ అనితగా నిర్లక్ష్యపు సమాధానాలు బట్టి దవాఖానలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. సేవలు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి. పేదల ఆర్థిక లేమితో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖానకు వెళితే సిబ్బంది ఈసడింపులు, నిర్లక్ష్యపు సమాధానమే ఎదురవుతున్నది. రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన ఆసుపత్రి సిబ్బంది, సేవా ధృక్పథాన్ని మరచి, అవినీతికి దాసోహం అన్నట్లు మారింది. బాధితులు సహాయం కోరినా, అధికార దుర్వినియోగం చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం గర్హనీయం. ఆసుపత్రిలో అక్రమ రీతిలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నా, బాధ్యులెవరూ స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది.
కఠిన చర్యలు తీసుకోవాలి
అధికారుల నిర్లక్ష్యంతో రోగులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది తమ కర్తవ్యాన్ని విస్మరించి, రోగులను పట్టించుకోకుండా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, అవినీతిని అరికట్టే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలా నిర్లక్ష్యం కొనసాగితే, పేదలకు మెరుగైన వైద్యం అందే ది ప్రశ్నగానే మిగిలిపోతుంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేల్కొని, ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కలెక్టర్ ను తప్పుదోవ పట్టించారా?
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకారం సుమారు 300కంటే ఎక్కువ బెడ్ షీట్స్ ఆసుపత్రికి సరఫరా చేసినట్టు సూపరింటెండెంట్ తెలిపారు. కానీ, వాటిలో ఒక్కటీ బెడ్స్ పై కనిపించడంలేదు. ఆసుపత్రిలో అసలు బెడ్ షీట్స్ ఉన్నాయా..? లేక అవి ఇతర ప్రయోజనాలకు మళ్లించారా..? అనే అనుమానాలు రోగుల కుటుంబసభ్యులను కలవరపెడుతున్నాయి. సిబ్బంది కలెక్టర్ ను సైతం తప్పుదోవ పట్టించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డిస్పోజబుల్ షీట్స్ వెనుక వ్యాపారం..?
ఆసుపత్రిలో బెడ్ షీట్స్ లేకుండా, డిస్పోజబుల్ షీట్స్ ఉపయోగించడానికి కారణం ఏమిటి..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైట్ బెడ్ షీట్స్ ఉండాలి. కానీ, ఇక్కడ మాత్రం డిస్పోజబుల్ షీట్స్ వాడుతున్నారు..? ఇది కూడా ఏదైనా వ్యాపార డీల్ లో భాగమా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి
బాధ్యులపై చర్యలు తీసుకునేనా?
ఆసుపత్రిలో నిజంగా బెడ్ షీట్స్ లేవా..? లేక అవి పక్కదారి పట్టాయా అనే విషయం పై విచారణ జరిపితే నిజానిజాలు బయటికి వస్తాయి. మరి ఈ విషయంలో జిల్లా కలెక్టర్ దృష్టి సారించి విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోగుల హక్కులను హరించే విధంగా ఆసుపత్రి సిబ్బంది వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శెనార్తి మీడియా, మంచిర్యాల:
