కన్నయ్య మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Tribals Rally: వేమనపల్లి మండలంలోని మంగేనపల్లి గ్రామానికి చెందిన నాయిని కన్నయ్య మృతికి న్యాయం చేయాలంటూ దండేపల్లి మండలంలోని మాకులపేట(Makulapeta) పంచాయతీ పరిధిలోని రాముని గూడెంలో సోమవారం తెలంగాణ ఆదివాసీ(Aadivaasi) గిరిజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. కన్నయ్య అగ్రవర్ణ కుటుంబం ఇంట్లో పాలేరుగా పనిచేస్తున్న సమయంలో వారిచేసిన కులదుర్మార్గపు వ్యాఖ్యలు, బెదిరింపులు తట్టుకోలేకపోయి అదే ఇంట్లో విషపదార్థం సేవించి ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కె అబ్దుల్లా తెలిపారు. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ (సీఐటీయూ జిల్లా కార్యదర్శి) మాట్లాడుతూ.. కన్నయ్యకు ఉన్న ఏకైక భూమిని కూడా అదే కుటుంబం అక్రమంగా తమ పేరుపై పట్టా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కన్నయ్య మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (Atracity Act)చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, అక్రమంగా ఆక్రమించిన భూమిని తిరిగి కుటుంబానికి అప్పగించాలన్నారు. ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, ఐటీడీఏ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ కుటుంబాన్ని సందర్శించాలని డిమాండ్ చేశారు. లేదంటే కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పరమేష్, హరి, ఆత్రం రఘు, ఆత్రం లచ్చు, కొట్నాక చిన్న జలపతి, కుడిమేత రాజు, కొట్నాక పెద్ద జలపతి, కోవ కృష్ణ, సిడం రవి శంకర్, కూరం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల