- వంతెన నిర్మాణం చేపట్టాలి
- ప్రమాదాలు జరకగముందే పనులు ప్రారంభించాలి
- బీఆర్ఎస్‌వై మానకొండూర్ నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్
Ganneruvaram Road : గన్నేరువరం చెరువు మత్తడి వద్ద కల్వర్టుపై వంతెన నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ డిమాండ్ చేశారు. రోడ్డు రెండు వైపులా పూర్తిగా కుంగిపోవడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గుండ్లపల్లి నుంచి పోత్తూరు వరకు డబుల్ రోడ్డు మంజూరు అయినా, పనులు ఇప్పటివరకు ప్రారంభించలేదని విమర్శించారు. నిధుల వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని, ప్రస్తుత మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ డబుల్ రోడ్డు నిర్మాణంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్ పెట్రోల్ బంకు, జంగాపల్లి, గన్నేరువరం వద్ద కల్వర్టుల నిర్మాణం వెంటనే పూర్తిచేయాలని కోరారు. వర్షాకాలం ప్రారంభమైందని, చెరువు నిండితే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అధికారులు తక్షణం స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఆయన వెంట బీఆర్ఎస్‌వై మండల అధ్యక్షుడు బోయిని కుమార్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మెరుగు రాము, యూత్ సభ్యులు ఎండీ నదీ, గుడాల సురేష్, తాటికొండ తిరుపతి, గుండా నరహరి, ప్రశాంత్ పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, గన్నేరువరం
