- ‘శెనార్తి మీడియా’ కథనానికి స్పందన
- బస్తాకు 2 రూపాయల వసూలుపై అదనపు కలెక్టర్ ఆగ్రహం
- మరోసారి పునరావృతమైతే చర్యలు తప్పవని కాంట్రాక్టర్ పై హెచ్చరికలు
Paddy Visit: మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేట్ వ్యాపారులు ధాన్యం కొనుగోళ్లపై జిల్లా అధికారులు ఆరా తీశారు. ‘ప్రభుత్వ కేంద్రాల్లో ప్రైవేటు వ్యాపారం’ శీర్షికన మే23న శెనార్తి మీడియాలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్‌తో పాటు అధికారులు స్పందించారు. జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ కోటపల్లి మండలంలోని బొప్పరం, సర్వాయిపేట్ కొనుగోలు కేంద్రాలను శుక్రవారం సందర్శించారు. వడ్ల కొనుగోలు తీరుపై రైతులను ఆరా తీశారు. ప్రైవేట్ గా వడ్లు కొనుగోలు చేస్తున్న వారి వివరాలు తెలుసుకున్నారు.

బస్తాకు రూ. 2 వసూలుపై ఆగ్రహం
కాగా కోటపల్లి మండలం బొప్పారంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి బస్తాకు 2 రూపాయలు లారీ డ్రైవర్లు వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఎలాంటి డబ్బులు వసూలు చేయొద్దని మందలించారు. వాహనాల రవాణా కాంట్రాక్టర్ ను పిలిపించి మాట్లాడారు.. మరోసారి రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అధికారుల విజిట్ పై ముందస్తు సమాచారం..?
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ‘శెనార్తి మీడియా’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు ఫీల్డ్ విజిట్‌పై ముందస్తుగా సెంటర్ల నిర్వాహకులు, రైతులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. అధికారుల విజిట్ అనంతరం ‘ఇయ్యాల సార్లు వస్తారని మాకు తెలుసు’ అని రైతులు గుసగుసలాడుకోవడం కనిపించింది. సెంటర్ల నిర్వాహకులు తమ తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు అధికారులు అడిగితే తమకు అనుకూలంగా చెప్పాలని స్థానిక రైతులను మొబిలైజ్ చేసినట్లు చర్చించుకోవడం కొసమెరుపు. అదనపు కలెక్టర్ వెంట పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి బ్రహ్మారావు, పౌరసరఫరాల సంస్థ అధికారి శ్రీకళ, డీఆర్డీఓ ఓ కిషన్, డీసీఓ కార్యాలయం సూపరింటెండెంట్ రవీందర్, కోటపల్లి తహసీల్దార్ రాఘవేందర్ రావు, డీసీఎంఎస్ జిల్లా అధికారి సంతోష్, సివిల్ సప్లయీస్ డీఆర్పీ రామస్వామి, పీఏసీఎస్ సీఈఓ రాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల
