- బావి పక్కనే కుంగిన రహదారి
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యం… ప్రజలకు ప్రాణ సంకటం
- చర్యలు తీసుకోవాలని డిమాండ్
Danger Road: గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి రహదారి ప్రమాదకరంగా మారింది. నెహ్రూ చౌరస్తాకు సమీపంగా ఉన్న వ్యవసాయ బావి పక్కన రోడ్డు కుంగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆ దారిలో ఎలాంటి వాహనాలు ప్రయాణించకపోవడంతో పెనుముప్పు నుండి బయటపడ్డారు.
ఉదయం గ్రామానికి చెందిన స్థానిక కాంగ్రెస్ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే రాళ్లను, తాటి కమ్మలను రహదారిపై ఉంచి ప్రజలకు హెచ్చరికగా ఏర్పాటు చేశారు.
గ్రామస్థుల ప్రకారం, రహదారి పక్కన ఉన్న బావుల వద్ద రక్షణ గోడలేమి కారణంగా ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ బావుల వద్ద భద్రతా చర్యలు తీసుకోకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. గతంలో కూడా గ్రామ పంచాయతీ కార్మికులు తాత్కాలికంగా కర్రలతో రక్షణ ఏర్పాటు చేసినా, దీన్ని స్థిరంగా మార్చేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని విమర్శిస్తున్నారు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోతేనే అధికారులకు, నాయకులకు అర్థమవుతుందా? అని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుని, రహదారి పక్కనున్న బావుల వద్ద తగిన రక్షణ చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు పోయేలా ఉన్నాయి..
తాళ్లపల్లి రవి గౌడ్, కాంగ్రెస్ గునుకుల కొండాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఈ రోడ్డు గుండా ప్రయాణించే వారి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఇది మా ఊరిలోనే జరిగంది. ఉదయాన్నే అటు వైపు వెళ్లడంతో ప్రమాదాన్ని గుర్తించి తాటికమ్మలు, రాళ్లు పెట్టాం. ఒకవేళ గమనించకపోయి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయేవో? తలుచుకుంటేనే భయంగా ఉంది.
పట్టించునేటోళ్లు లేరు
న్యాలపట్ల శంకర్, బీఆర్ఎస్ గునుకుల కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు
ఇక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఎప్పటి నుంచో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం రాత్రి కురిసిన చిన్న వానకే కుంగింది. రోడ్డు వేసేటప్పుడు బావి వద్ద సైడ్ వాల్ కట్టకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాంట్రాక్టర్ ఉదాసీనత ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టించుకోవడం లేదు. అధికారులు, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం నడుస్తున్నది.
-శెనార్తి మీడియా, గన్నేరువరం: