- అధికారులు, ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలి :
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
Dist Collector : మంచిర్యాల జిల్లా సివిల్ సప్లయ్ కార్పొరేషన్ లో ఏం జరుగుతోంది? శీర్షికన ‘శెనార్తి మీడియా’లో ప్రచురితమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపింది. మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఈ కథనానికి స్పందించారు. నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కలెక్టరేట్ ఏవో పిన్న రాజేశ్వర్ తో కలిసి శనివారం ఉదయం తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల రిజిస్టర్లు, రికార్డులు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హాజరు పట్టికలు, ఆయా కార్యాలయాల పరిధిలో కొనసాగుతున్న పనుల వివరాలను పరిశీలించారు.

అధికారులు, ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: కలెక్టర్
ప్రభుత్వ శాఖల అధికారులు ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు అవసరమైన సేవలు అందించేందుకు పనిచేస్తాయని, ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు ప్రజలకు చేరువలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజలకు జవాబుదారీగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. ముందస్తుగా సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా శాఖల్లోని మొత్తం 50 మందికి షోకాజ్ నోటీసలు జారీ చేసినట్లు తెలిసింది. విధుల్లో నిర్లక్ష్యం చూపితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఒక్కసారిగా కలెక్టర్ తీసుకున్న చర్యలు జిల్లా అధికార యంత్రాంగాన్ని కుదిపేశాయి.
కలెక్టర్ పై అదనపు బాధ్యతలు
ఇప్పటికే పలు శాఖలకు జిల్లా కలెక్టర్ ఇన్ చార్జిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ అదనపు బాధ్యలతో పనిభారం పెరిగిపోయింది. అదే సమయంలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యం ప్రభుత్వ అధికారులపై నమ్మకం సన్నగిల్లేలా చేస్తుండడంతో కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

-శెనార్తి మీడియా, మంచిర్యాల