- అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కలెక్టర్
- సమన్వయంతో పని చేయాలని ఆదేశాలు

Floods in Mancherial: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంచిర్యాలను వరద ముంచెత్తుతున్నది. వరద పరిస్థితుల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంచిర్యాల పట్టణంలోని గోదావరి తీరం, మాతా శిశు హాస్పిటల్ పరిసరాలను కలెక్టర్ ఆర్‌ఐ శిరీషతో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షపాతం కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం పెరుగుతోందని, ప్రజల రక్షణ కోసం రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించి పునరావాసం కల్పించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం జిల్లా సమీకృత కార్యాలయంలో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.

ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం హాజీపూర్ మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును తహసీల్దార్ శ్రీనివాస్ రావు దేశ్‌పాండేతో కలిసి పరిశీలించారు. వరద ఇన్‌ఫ్లో అధికంగా ఉన్నందున అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, వర్షపు నీరు నిల్వ కాకుండా తొలగిస్తూ దోమల వృద్ధిని అరికట్టేందుకు ఆయిల్ బాల్స్, దోమల మందు పిచికారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ముల్కల వద్ద గోదావరి నది తీరాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మంచిర్యాల సమీపంలోని గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో స్థానిక ఎన్టీఆర్ నగర్ లోని పలు ఇల్లు నీట మునిగియి. రం నగరలోకి కూడా రాళ్ళావాగులోని నీరు వస్తున్నాయి. మాతా శిశు హాస్పిటల్ ను మూడోసారి వరద ముంచెత్తింది.
– శెనార్తి మీడియా, మంచిర్యాల
