DURGA SHOBHAYATRA : నస్పూర్ న్యూ నాగార్జున కాలనీలో శుక్రవారం దుర్గాదేవి శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. నవరాత్రులు ఒక్కో అవతారంలో భక్తులకు దుర్గాదేవి దర్శనమిచ్చింది. శ్రీ విజయ కనక దుర్గా భక్త మండలి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు నూతి వెంకటాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, అమ్మవారి చీరలకు, శ్రీచక్రానికి వేలం నిర్వహించారు.

- ఆకట్టుకున్న కోలాటాలు, నృత్యాలు…
మహిళల కోలాటాలు, యువకుల నృత్యాలు, డబ్బు చప్పుళ్లు, డీజే (DJ) సౌండ్ల మధ్య అమ్మవారి శోభయాత్ర కన్నుల పండువగా సాగింది. ఆధ్యాంతం అమ్మవారి యాత్ర ఆకట్టుకుంది. యాత్రలో అమ్మవారి రథానికి భక్తులు నీళ్లు చల్లి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సింగరేణి కార్మికులు, కార్మిక కుటుంబాలు దుర్గాదేవి అమ్మవారిని గొప్పగా కొలుస్తారు. సింగరేణి కార్మికులు మంగళ హారతులతో అమ్మవారికి స్వాగతం పలుకుతూ శోభ యాత్ర వెంట నడిచారు. భవాని మాల వేసిన భక్తులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. అనంతరం సమీప గోదావరి నదీ తీరంలో అమ్మవారిని నిమజ్జనం చేశారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల :
