Patakulu: నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన పటాకుల దుకాణాలతో ప్రమాదం పొంచి ఉందని పలువురు స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సెలవులతో పాటు పక్కనే ఎగ్జిబిషన్ ఉండటంతో వేలాది మంది ప్రజలు రానున్న నేపథ్యంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది అని ప్రశ్నిస్తున్నారు.
పాత రాయల్ టాకీస్ వద్ద ప్రతి మంగళవారం, శనివారం వారసంత జరిగే ప్రాంగణంలో పటాకుల దుకాణాలు ప్రహరీ వెలుపలకే అనుమతిస్తామని అధికారులు చెబుతుండగా, ప్రస్తుతం ప్రాంగణం లోపలే షాపులు ఏర్పాటు చేయడం నియమ నిబంధనలకు విరుద్ధమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కూరగాయల మార్కెట్‌లో కేవలం ఒకే షాప్‌కు మాత్రమే పేరు ఉండగా, మిగతా షాపులకు అనుమతులున్నాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు ఉన్నాయని చెబుతున్న నిర్వాహకులు ఫ్లెక్సీ పెట్టకపోవడం సందేహాలకు తావిస్తోంది.
దీనిపై నస్పూర్ తహసీల్దార్ స్పందిస్తూ పటాకుల దుకాణాలకు తమ కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ సంపత్‌కి లేఖ పంపినట్లు తెలిపారు. కాగా కమిషనర్ ఫోన్‌కి స్పందించకపోవడం గమనార్హం.
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
-శెనార్తి మీడియా, మంచిర్యాల:
