ACB Raids
ACB Raids

ACB Raids: ఏసీబీ వలలో డిప్యూటీ రిజిస్ట్రార్

  • లంచం తీసుకుంటూ చిక్కిన రాథోడ్ భిక్కు
  • మంచిర్యాలలోని అద్దె ఇంట్లో పట్టుకున్న అధికారులు

ACB Raids: మంచిర్యాల జిల్లా సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్ రాథోడ్ భిక్కు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ ఏసీబీ అధికారుల వలలో చిక్కాడు. శనివారం ఉదయం 9.02 గంటలకు మంచిర్యాల పట్టణంలోని ఆయన అద్దె ఇంటిపై ఏసీబీ బృందం దాడి నిర్వహించింది.

రాథోడ్ భిక్కుది ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం రాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనాయక్ తండా. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా సహకార సంఘాల డిప్యూటీ రిజిస్ట్రార్‌గా, అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జిగా కూడా విధులు నిర్వహిస్తున్నాడు.

ACB Raids
ACB Raids: లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ రిజిస్ట్రార్ రాథోడ్ భిక్కు

ఫిర్యాదుదారుడికి అనుకూలంగా వ్యవహరించేందకు రాథోడ్ ముందుగా రూ.7 లక్షలు లంచంగా డిమాండ్ చేశాడు. పలుమార్లు అభ్యర్థించడంతో మొత్తం రూ.5 లక్షలకు ఒప్పకున్నాడు. తొలి విడతగా రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ జీ మధు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతంలో ఓ ఉద్యోగి సస్పెండ్ అయ్యాడు. అతడిని సస్పెన్షన్‌ నుంచి తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడం, జీవో 44 ప్రకారం వేతన సవరణల చేయడం, 2023 ఏప్రిల్‌ నుంచి పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లించడం, సస్పెన్షన్‌ కాలానికి సంబంధించిన భత్యాలు మంజూరు చేయడం, విచారణ నివేదికపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

దాడి అనంతరం నిర్వహించిన రసాయన పరీక్షలో రాథోడ్ కుడిచేయి వేళ్లు, లంచం డబ్బు తాకిన బనియన్‌ భాగం పాజిటివ్‌గా తేలిందని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. విధులు అక్రమంగా, అసత్యంగా నిర్వహించినట్లు తేలడంతో ఆయనను అరెస్టు చేసి కరీంనగర్‌ ఏసీబీ ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని అధికారులు వెల్లడించారు.

లంచం అడిగితే ఫిర్యాదు చేయండి..
ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ప్రజలు నిర్భయంగా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064 కు కాల్‌ చేయవచ్చు. అలాగే వాట్సాప్‌ 9440446106, ఫేస్‌బుక్‌ (Telangana ACB), ఎక్స్‌/ట్విట్టర్‌ (@TelanganaACB) ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఎవరైనా లంచం అడిగితే తన సెల్ నంబర్ 9154388963లో సంప్రదించాలని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

-శెనార్తి మీడియా, మంచిర్యాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *