- వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి
Ponguleti : రాష్ట్రంలో అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో రేషన్కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఇల్లు లేని నిరుపేద లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం క్రింద ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, రేషన్ కార్డుల జారీలో నిబంధనలు పాటిస్తూ అర్హులైన అభ్యర్థుల వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో మీ-సేవ కేంద్రాలలో చేసుకున్న దరఖాస్తులు, సామాజిక, ఆర్థిక, విద్య, వైద్య, రాజకీయ, కుల గణన కార్యక్రమంలో సేకరించిన సమాచారం, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలు జాబితాలో రానప్పటికీ మండల ప్రజా పరిషత్ కార్యాలయాలు, ప్రజాపాలన సేవా కేంద్రాలలో, గ్రామసభలలో దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుల వివరాలు కంప్యూటరైజ్ చేయబడతాయని, అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి ఆహార భద్రత రేషన్ కార్డు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రేషన్ కార్డు కలిగి ఉండి కుటుంబ సభ్యుల నమోదు, విభజన అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. రేషన్ కార్డు ప్రక్రియకు సంబంధించి ప్రతి రోజు నివేదికను జిల్లా ఇన్చార్జ్ మంత్రికి సమాచారం అందించాలని, రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. రైతు భరోసా పథకంలో వ్యవసాయ యోగ్యం కాని రాళ్లు, గుట్టలు, కాలనీలు, ఇండ్ల వెంచర్లు, లే-అవుట్లు, నాలా భూములు, వివిధ అభివృద్ధి పథకాల కొరకు ప్రభుత్వం సేకరించిన భూములు జాబితా నుండి తొలగించాలని తెలిపారు. ఆయా జిల్లాలోని భూములను, వివరాలను రెవెన్యూ రికార్డులతో సరి చూసి గ్రామసభకు ముందుగానే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు.
సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు లేని అర్హత గల నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తించేలా చూడాలని తెలిపారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాల పరిశీలన అనంతరం అర్హుల జాబితాలో మట్టిగోడలతో నిర్మించిన ఎ.సి. షీట్స్, పెంకులు, రేకులు ప్రాధాన్యత క్రమంలో అత్యంత నిరుపేద అర్హులకు పథకం వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు. జాబితాలో వివరాలు రాని వారు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల యాప్లో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం క్రింద నిరుపేద కూలీలు, వ్యవసాయ కూలీలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజులు పని చేసిన కుటుంబాలను గుర్తించాలని, జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలలో ఇంటి పెద్ద పురుషుడు ఉ న్నట్లయితే ఆ ఇంటి మహిళ పేరిట జాబ్ కార్డు మార్పు చేసుకొని, బ్యాంక్ ఖాతా వివరాలను అందించినట్లయితే సంబంధిత ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. 2023లో గ్రామపంచాయతీలను పురపాలక సంఘాలుగా మార్చిన గ్రామాలకు కూడా ఈ పథకం వర్తింప చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 21 నుండి 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించి అర్హులైన వారి జాబితాను చదివి వినిపించిన అనంతరం జాబితాలో లేని వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గ్రామ సభ నిర్వహించే ముందు ఆయా ప్రాంతాల ప్రజలకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో అందరూ నిబద్ధతతో పని చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజాపాలనలో రేషన్కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరించడం జరుగుతుందని, ఈ క్రమంలో జిల్లాలోని 16 మండలాలో 11 వేల 767 ఇండ్లు ఉండగా 7 వేల 927 ఇండ్లు సర్వే చేయడం జరిగిందని, 7 మున్సిపాలిటీలలో 18 వేల 788 ఇండ్లు ఉండగా 14 వేల 25 ఇండ్ల నుండి వివరాలు సేకరించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో 35 వేల 956 రేషన్ కార్డులలో అదనపు సభ్యుల నమోదు కొరకు దరఖాస్తులు అందాయని, పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-శెనార్తి మీడియా, మంచిర్యాల