- మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇసుక తరలింపులో కానరాని నిబంధనలు
- పర్యావరణానికి ముప్పు తప్పదంటున్న ప్రజలు
- గోదావరి నుంచి ఇసుక, మట్టి అక్రమ తరలింపుపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆగ్రహం
Sand Mafia : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరిలో ఇసుక తవ్వకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాలలోని గోదావరిలో దాదాపు పది మీటర్లకు మించి లోతు తవ్వుతూ ఇసుక తరలిస్తున్నారు. అక్కడి గోతులు బావులను తలపిస్తున్నాయి. తవ్వకాలు ఇలాగే కొనసాగితే పర్యావరణానికి ముప్పు తప్పదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ తవ్వకాలకు అనుమతులు ఎక్కడివి..?
జిల్లా కేంద్రానికి ఆనుకొని ప్రవహించే గోదారమ్మ గుండెల్లో జేసీబీలు దించి శ్మశాన వాటిక కోసమంటూ పెద్ద మొత్తంలో ఇసుక, మట్టి తరలించడంపై అనేక అనుమానాలు వెలువెత్తుతున్నాయి. జిల్లాలో ఏకచత్రాధిపత్యంతో, ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వారు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉండగా అటు టీఎస్ఎండీసీ, ఇటు మంచిర్యాల జిల్లా మైనింగ్ అధికారులకు సమాచారమే లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం ‘మాములు’గా వ్యవహరించడంపై విమర్శులు వెల్లువెత్తుతున్నాయి.

మైనింగ్ అధికారి ఉన్నాడా..? లేడా.?
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరిలో ఇసుక తవ్వకాలు, తరలింపుపై జిల్లా మైనింగ్ అధికారికి జగన్ మోహన్ రెడ్డి కి ‘శెనార్తి మీడియా’ శనివారం ఫోన్ కాల్ చేయగా స్పందించలేదు. ఆయన కార్యాలయంలోనూ సంప్రదించేందుకు వెళ్లగా అందుబాటులో లేడని అక్కడి సిబ్బంది చెప్పడం గమనార్హం. మంచిర్యాల గోదావరి నుంచి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన మైనింగ్ అధికారి అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎవరిపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
ఎమ్మెల్యే పీఎస్సార్ అండతోనే : నడిపెల్లి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది నుంచి ఇసుక, మట్టి తరలింపుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు స్పందించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నేతృత్వంలో వందలాది లారీల్లో ద్వారా ఇసుక, మట్టిని తరలిస్తున్నారని అటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, తన జేబులు నింపుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ అధికారులకు ఇదంతా తెలిసే జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం

సరికాదన్నారు. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని, ముప్పు వాటిల్లకుండా చూడాలన్నారు. అదే విధంగా, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.
– శెనార్తి మీడియా, మంచిర్యాల